
నల్లగొండ: ఉద్యమాలకు పురిటిగడ్డ నల్లగొండ. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకుని.. తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించిన చరిత్ర నల్లగొండది. కాకతీయుల కాలం నాటి శిల్ప సంపదతో పానగల్ దేవాలయాలు ప్రసిద్ధిచెందాయి. ప్రస్తుతం విద్య, వైద్య రంగాల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ ద్వారా వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. నాగార్జున డిగ్రీ కళాశాలకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల ఏర్పాటు చేసింది.
ధాన్య భాండాగారంగా..
నల్లగొండ ధాన్య భాండాగారంగా మారింది. ఒక నాడు తాగునీటికే ఇబ్బందులు ఉండేవి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నప్పటికీ స్థానికంగా నివాసం ఉండేందుకు ఇష్టపడకపోయేవారు. కృష్ణా జలాలు నల్లగొండకు రావడం, ఆ పరిసర గ్రామాల్లో చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయి. పానగల్ ఉదయ సముద్రం నుంచి నల్లగొండ పట్టణంతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలకు కృష్ణా జలాలు అందుతున్నాయి. చెరువులను నింపడం వల్ల భూగర్భ జలాలు పెరిగి సాగు కూడా పెరిగింది. వరి దిగుబడిలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా మొదటిస్థానంలో ఉండగా.. అందులో నల్లగొండ నియోజకవర్గంలోనే అత్యధిక వరి సాగైంది. ఈ నల్లగొండ నియోజకవర్గంలో బత్తాయి సాగు కూడా అధికంగానే ఉంది.
ఏడుసార్లు కాంగ్రెస్ విజయం..
నల్లగొండ నియోజక వర్గం 1952లో ఏర్పడింది. ఆనాటి నుంచి ఒక ఉప ఎన్నికతో పాటు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ మూడుసార్లు, పీడీఎఫ్ రెండుసార్లు గెలుపొందాయి. సీపీఎం, సీపీఐ, టీఆర్‌ఎస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు. నల్లగొండ నియోజకవర్గం గతంలో ఐదు మండలాలతో కలిపి ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో నల్లగొండ పట్టణంతో పాటు నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాలతో నియోజకవర్గం ఏర్పడింది.
కోమటిరెడ్డిదే రికార్డు..
నల్లగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఈ సెగ్మెంట్ నుంచి ఈయన ఒక్కరే హ్యాట్రిక్ సాధించారు. 1999 నుంచి 2014 వరకు వరుసగా గెలిచి రికార్డు నెలకొల్పారు. చకిలం శ్రీనివాసరావు, గుత్తా మోహన్‌రెడ్డిలు రెండు పర్యాయాల చొప్పున విజయం సాధించారు.
ఇద్దరు మంత్రులు
నల్లగొండ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారిలో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. ఒకరు గుత్తా మోహన్‌రెడ్డి, మరొకరు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. నాదెండ్ల భాస్కర్‌రావు కేబినేట్‌లో గుత్తా మోహన్‌రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వైఎస్సార్ మంత్రివర్గంలో, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేశారు.
ఎన్‌టీ రామారావు గెలుపు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీ రామారావు కూడా నల్లగొండ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1985 ఎన్నికల్లో ఎన్టీఆర్ రాష్ట్రంలో మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అందులో నల్లగొండ కూడా ఉంది. మూడు చోట్ల నుంచి కూడా గెలుపొందిన ఎన్టీఆర్.. నల్లగొండ స్థానానికి రాజీనామా చేశారు. అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నుంచి గడ్డం రుద్రమదేవి పోటీచేసి గెలుపొందారు.
నల్లగొండ నియోజకవర్గంలో గెలుపొందిన ఎమ్మెల్యేలు వీరే..
Comments
Please login to add a commentAdd a comment