నవీన్ (ఫైల్)
నల్గొండ: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతిచెందాడు. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండలంలోని కొమ్మాల గ్రామంలో ఈ నెల 12న తేదీన జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాల గ్రామానికి చెందిన భాషపోలు నవీన్(35)ది వ్యవసాయ కుటుంబం. నవీన్‌కు 14 ఏళ్ల కిందట నిర్మలతో వివాహమైంది.
వీరికి ఇద్దరు కుమార్తెలు అక్షిత, దీక్షిత ఉన్నారు. నవీన్, నిర్మల మధ్యన చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడడంతో గత రెండేళ్ల నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టగా.. చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడవద్దని ఇద్దరికీ నచ్చజెప్పారు. అయినప్పటికీ అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 12న భార్యభర్తలిద్దరు తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పనులు చేసుకుంటూ అక్కడ కూడా ఘర్షణ పడ్డారు.
క్షణికావేశంలో నిర్మల అక్కడే ఉన్న పురుగుల మందు తాగింది. దీంతో తాను కూడా తాగుతానని నవీన్ అక్కడే ఉన్న గడ్డి మందును తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి ఇద్దరిని సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. నిర్మల సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కోలుకుంటుంది. కాగా నవీన్ మృతదేహానికి గురువారం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి వీరస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు అర్వపల్లి ఎస్‌ఐ బి. అంజిరెడ్డి తెలిపారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి కూడా చదవండి: పెళ్లి చేసుకుంటానని ఇలా చేశాడు. చివరికి యువతి?
Comments
Please login to add a commentAdd a comment