Telangana Crime News: యథేచ్ఛగా గంజాయి రవాణ.. అడ్డుకునేది ఎవరు?
Sakshi News home page

యథేచ్ఛగా గంజాయి రవాణ.. అడ్డుకునేది ఎవరు?

Published Thu, Dec 21 2023 2:06 AM | Last Updated on Thu, Dec 21 2023 12:10 PM

- - Sakshi

రామాపురం చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన గంజాయి (ఫైల్‌)

కోదాడ: తెలంగాణ రాష్ట్రంలోకి గంజాయి రవాణాకు రాచమార్గంగా మారిన విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీలు నామమాత్రంగా మారాయి. దీంతో పాటు నిఘా లేక పోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా గంజాయి రవాణా చేస్తున్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏఓబీ) నుంచి హైదరాబాద్‌, ముంబయిలకు చెందిన కొన్ని ముఠాలు ప్రయాణికుల మాదిరిగా బస్సుల్లో ప్రయాణిస్తూ గంజాయి రవాణా చేస్తున్నారు.

దీనిని అరికట్టడానికి తెలంగాణ–ఆంధ్రా సరిహద్దుగా ఉన్న కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద గత సంవత్సరం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో క్వింటాళ్ల కొద్ది గంజాయి పట్టుబడింది. వందల కొద్ది కేసులు నమోదు చేశారు.

ఆ తరువాత ఏమైందో ఏమోకానీ ఈ తనిఖీలను అధికారులు ఎత్తి వేశారు. తాజాగా ప్రభుత్వం గంజాయి రవాణా, డ్రగ్స్‌ వినియోగంపై సీరియస్‌గా ఉండడంతో మరోసారి రామాపురం క్రాస్‌ రోడ్డు చెక్‌పోస్టు వద్ద నిఘా పెంచడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఏడాది కాలంలో..
కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద 2022 జూన్‌ నుంచి 2023 జూన్‌ వరకు గంజాయి రవాణా చేస్తూ వంద మందికిపైగా నిందితులు పట్టుబడ్డారు. 24/7 నిఘా ఉండడంతో వందల క్వింటాళ్ల గంజాయి 10కి పైగా కార్లు, ద్విచక్రవాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 120 కేసులు నమోదయ్యాయి.

ఈ చెక్‌పోస్టు కోదాడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుండడంతో పట్టుబడిన కేసులన్నింటినీ నమోదు చేయలేక రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద పట్టుబడిన గంజాయిని నడిగూడెం, కోదాడ టౌన్‌, అనంతగిరి, నేరేడుచర్ల పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పట్టుబడనట్లు కేసులు నమోదు చేసేవారంటే గంజాయి ఏ స్థాయిలో రవాణా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

పోలీసుల చర్యలతో గంజాయి రవాణాకు చాలా వరకు బ్రేక్‌ పడింది. తరువాత అధికారులు పట్టించుకోకపోవడం, ఎన్నికలు రావడంతో గంజాయి రవాణా మళ్లీ పుంజుకుందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా గంజాయి విక్రయిస్తూ ముగ్గురు పోలీసులకు పట్టుబడడంతో దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

సంచలన కేసును నీరుగార్చారా..?
కోదాడ చెక్‌పోస్టు వద్ద పోలీసులు గంజాయిని పట్టుకోవడంతో వారు స్థానిక నాయకులతో పైరవీలు చేయించడం మొదలు పెట్టారు. దీనిలో వస్తున్న ఆదాయాన్ని చూసిన కొందరు తామే గంజాయి రవాణా చేయడం షురూ చేశారు. వీరు తెలివిగా గ్యాస్‌ సిలిండర్లలో గంజాయి పెట్టి రవాణా చేస్తున్నారనే సమాచారంతో నల్లగొండ సీసీఎస్‌ పోలీసులు 2022 జూలై 29న నకిరేకల్‌ వద్ద మాటు వేసి పట్టుకున్నారు.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్‌ ఉన్నతాధికారి గతంలో కోదాడలో పనిచేశారు. ఈ కేసులో అప్పట్లో కోదాడలో అధికార పార్టీకి చెందిన వారు కొందరు ఉడడంతో సదరు సీసీఎస్‌ అధికారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఈ కేసులో కోదాడకు చెందిన ముఖ్యులను తప్పించారు.

దీంతోపాటు సంచలనంగా మారుతుందని గ్యాస్‌ సిలిండర్లలో గంజాయి రవాణా విషయాన్ని కూడా నాడు పోలీసులు వెల్లడించకుండా కొందరు యువకులపై కేసు నమోదు చేసి వదిలేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. గంజాయి రవాణాతో సంబంధం ఉన్నవారు నాటి అధికారపార్టీ నేతల అండతో కోదాడలో చెలరేగిపోయారని, కోదాడలో యువతను గంజాయికి బానిసలుగా మార్చారని వీరందరిపై చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

కోదాడలో గంజాయి లేకుండా చేస్తా..
కోదాడ పట్టణంలో గంజాయి లేకుండా చేయడమే నా మొదటి ప్రాధాన్యత. పోలీసులతో మాట్లాడాను. త్వరలోనే దీనిపై కార్యాచరణ రూపొందిస్తాం. ఈ వ్యవహారంలో ఎవరున్నా వదిలేది లేదు. కోదాడ యువతను కాపాడేందుకు ఎంత వరకైనా వెళతాను. గంజాయి అమ్మేవారు, రవాణా చేసేవారు వెంటనే మానుకోవాలి. – నలమాద పద్మావతి, కోదాడ ఎమ్మెల్యే

24 గంటల నిఘా ఏర్పాటు చేశాం
కోదాడ రూరల్‌ పరిధిలో ఉన్న రామాపురం అంతరాష్ట్ర సరిహద్దులో ఉన్న చెక్‌ పోస్టు వద్ద నిఘా పెంచాము. ముగ్గురు ఎస్‌ఐలతో 24 గంటలు నిఘా, తనిఖీలు చేయనున్నాం. గంజాయి రవాణా చేసినా, అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు ఉంటాయి. ప్రజలు కూడా సమాచారం ఉంటే పోలీసులకు నేరుగా చెప్పవచ్చు.  – రామకృష్ణారెడ్డి, కోదాడ రూరల్‌ సీఐ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement