నల్లగొండ క్రైం: జిల్లా ఎస్పీ అపూర్వరావు బదిలీ అయ్యారు. ఆమెను ప్రభుత్వం సీఐడీ ఉమెన్ ప్రొటక్షన్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అపూర్వరావు 2023, జనవరి 26న నల్లగొండలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న చందనాదీప్తిని ప్రభుత్వం నియమించింది. 2012 బ్యాచ్‌కు చెందిన చందనా దీప్తి ట్రెయినీ ఐపీఎస్‌గా నల్లగొండ జిల్లాలో విధులు నిర్వహించారు. ఇక్కడి రాజకీయ, ఆర్థిక, సామాజిక, నేరాలపై ఆమెకు పూర్తి అవగాహన ఉంది.
ట్రెయినీ ఐపీఎస్‌గా నల్లగొండలో విధులు
చందనాదీప్తి 1983లో వరంగల్‌లో జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె విద్యాభ్యాసం వివిధ ప్రాంతాల్లో సాగింది. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేశారు. సివిల్స్ వైపు దృష్టి సారించి హైదరాబాద్‌లోని కోచింగ్ తీసుకుని రెండో ప్రయత్నంలో ఐపీఎస్ ర్యాంకు సాధించారు. ఐపీఎస్‌గా సెలక్ట్ అయ్యాక నల్లగొండలో ట్రెయినీ ఐపీఎస్‌గా విధులు నిర్వహించారు. తర్వాత తాండూరు ఏఎస్పీగా, నిజామాబాద్ ఓఎస్‌డీగా, మెదక్ ఎస్పీగా, నార్త్ జోన్ డీసీపీగా విధులు నిర్వహించారు. మెదక్ ఎస్పీగా ఉన్న సమయంలో ‘ఆస్క్ మెదక్ ఎస్పీ’ పేరుతో ఫేస్‌బుక్ పేజీని క్రియేట్ చేసుకుని ఆ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
చిట్యాల పోలీస్‌స్టేషన్‌లోనూ..
చిట్యాల : నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా బదిలీపై వచ్చిన చందనాదీప్తి మూడు నెలల పాటు చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో కొంతకాలం ఐపీఎస్ ట్రెయినీ విధుల్లో భాగంగా ఎస్‌ఐగా విధులను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓ ముఠా సమాచార కమిషనర్ ఫేక్ ఐడీకార్డులు సృష్టించి కార్ల నంబర్ ప్లేట్‌లపై సమాచార కమిషనర్‌గా పేర్లతో రాసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్‌గేట్‌ల వద్ద ఉచితంగా వెళ్తున్న వాహనాలను అప్పట్లో ఆమె పట్టి వేశారు. అనంతరం ఫేక్ ఐడీ కార్డులు సృష్టించిన ముఠా సభ్యులను పట్టుకుని కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment