apoorvarao
-
నల్లగొండ ఎస్పీగా చందనాదీప్తి
నల్లగొండ క్రైం: జిల్లా ఎస్పీ అపూర్వరావు బదిలీ అయ్యారు. ఆమెను ప్రభుత్వం సీఐడీ ఉమెన్ ప్రొటక్షన్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అపూర్వరావు 2023, జనవరి 26న నల్లగొండలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న చందనాదీప్తిని ప్రభుత్వం నియమించింది. 2012 బ్యాచ్‌కు చెందిన చందనా దీప్తి ట్రెయినీ ఐపీఎస్‌గా నల్లగొండ జిల్లాలో విధులు నిర్వహించారు. ఇక్కడి రాజకీయ, ఆర్థిక, సామాజిక, నేరాలపై ఆమెకు పూర్తి అవగాహన ఉంది. ట్రెయినీ ఐపీఎస్‌గా నల్లగొండలో విధులు చందనాదీప్తి 1983లో వరంగల్‌లో జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె విద్యాభ్యాసం వివిధ ప్రాంతాల్లో సాగింది. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేశారు. సివిల్స్ వైపు దృష్టి సారించి హైదరాబాద్‌లోని కోచింగ్ తీసుకుని రెండో ప్రయత్నంలో ఐపీఎస్ ర్యాంకు సాధించారు. ఐపీఎస్‌గా సెలక్ట్ అయ్యాక నల్లగొండలో ట్రెయినీ ఐపీఎస్‌గా విధులు నిర్వహించారు. తర్వాత తాండూరు ఏఎస్పీగా, నిజామాబాద్ ఓఎస్డీగా, మెదక్ ఎస్పీగా, నార్త్ జోన్ డీసీపీగా విధులు నిర్వహించారు. మెదక్ ఎస్పీగా ఉన్న సమయంలో ‘ఆస్క్ మెదక్ ఎస్పీ’ పేరుతో ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేసుకుని ఆ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. చిట్యాల పోలీస్స్టేషన్లోనూ.. చిట్యాల : నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా బదిలీపై వచ్చిన చందనాదీప్తి మూడు నెలల పాటు చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో కొంతకాలం ఐపీఎస్ ట్రెయినీ విధుల్లో భాగంగా ఎస్ఐగా విధులను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓ ముఠా సమాచార కమిషనర్ ఫేక్ ఐడీకార్డులు సృష్టించి కార్ల నంబర్ ప్లేట్లపై సమాచార కమిషనర్‌గా పేర్లతో రాసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద ఉచితంగా వెళ్తున్న వాహనాలను అప్పట్లో ఆమె పట్టి వేశారు. అనంతరం ఫేక్ ఐడీ కార్డులు సృష్టించిన ముఠా సభ్యులను పట్టుకుని కేసులు నమోదు చేశారు. -
శాపానికి గురైతే...
యశ్ పూరి, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకత్వంలో సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ ఫిల్మ్స్ పతాకాలపై అనిల్ పల్లాల నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ‘‘నా నిగ్రహాన్ని పరీక్షించుకోవడానికి వస్తే నా పరువు తీస్తావా. ఇక నీకు మిగిలింది నిగ్రహమే’, ‘బాబా శాపం ఇచ్చాడా?’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. టీజర్ రిలీజ్ సందర్భంగా హీరో యశ్ మాట్లాడుతూ– ‘‘ఇది నాకు మూడో సినిమా. పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథే ఈ చిత్రం’’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ ఫిల్మ్ ఇది’’ అన్నారు కౌశిక్. ‘‘సినిమా బాగా వచ్చింది. ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు అనిల్. ‘‘ఒంగోలులో పుట్టి గుజరాత్, గల్ఫ్‌లో పెరిగాను. స్టడీస్ తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఇది నా తొలి చిత్రం’’ అన్నారు అపూర్వ. ‘‘ఈ జనరేషన్లోని అబ్బాయి ఓ బాబా శాపానికి గురైతే అతని పరిస్థితి ఏంటి? అన్నదే ఈ సినిమా కథ’’ అన్నారు కెమెరామేన్ అశోక్. -
'అది నా అదృష్టం.. అమితానందం'
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారిణిగా సొంత రాష్ట్రానికే సేవలందించే అదృష్టం రావడం అమితానందంగా ఉందని కె.అపూర్వ రావు అన్నారు. ఈనెల 31న పాసింగ్ పరేడ్ అనంతరం రాష్ట్రానికి సేవలందించేందుకు సిద్ధమవుతున్న యువ మహిళా ఐపీఎస్ ‘సాక్షి’తో మాట్లాడారు. ‘దేశానికి సేవలందించేందుకు అత్యంత అద్బుతమైన మార్గం పోలీస్. అందుకే ఎంతో మక్కువతో ఐపీఎస్ అయ్యా. సివిల్ సర్వీస్ 2013 బ్యాచ్‌లో దేశానికి చెందిన 141 మంది శిక్షణ పొందాం. నాతో పాటు రాహుల్ హెగ్డె బి.కె, సునీల్ దత్‌ను తెలంగాణకి కేటాయించారు. ఇలా సొంత రాష్ట్రాలకు కేటాయింపులు చేయడం చాలా అరుదుగా ఉంటుంది. అటువంటి సేవలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. పుట్టినగడ్డకు రుణం తీర్చుకునే అవకాశం ఈ రకంగా వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. ప్రజలకు మేలు చేస్తా’నని తెలిపారు. ప్రజల కష్టాలు తెలుసు... స్వస్థలం హైదరాబాద్‌లోని బేగంబజార్. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న కె.నాగేశ్వరరావు సివిల్ కాంట్రాక్టర్. అమ్మ అరుణ గృహిణి. సోదరిణి కూడా ఉంది. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలమే. అయితే నేను చిన్నదాన్ని కావడంతో ఎక్కువ గారాబం చేశారు. ఆడపిల్లలమని ఎక్కడా మాకు నిబంధనలు పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. చదివింది బీటెక్ అయినా...పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తానంటే అమ్మనాన్నలు ఎక్కడ అడ్డు చెప్పలేదు. కుటుంబ ఆర్థిక అవసరాల దృష్ట్యా బీటెక్ అయ్యాక ఓ సంవత్సరం పాటు టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఐపీఎస్‌కు ట్రై చేశా. తొలి ప్రయత్నంలోనే 596వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికవడం. అది కూడా సొంతగడ్డకు సేవ చేసే భాగ్యం రావడం జీవితంలోనే అత్యంత మధురక్షణాలు. రోజులు మారాయి... పోలీసుశాఖలో మహిళలు ఎక్కువ చేరడానికి అంతగా ఆసక్తి చూపరనేది గతం. ప్రస్తుతం రోజులు మారాయి. మహిళలు కూడా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఈ విషయం ఇప్పటికే నిరూపితమైంది కూడా. పోలీసుశాఖలో మహిళల శాతం చాలా తక్కువగా ఉండటం వాస్తవమే... అయినా ఇది బాధాకరం. పోలీసుశాఖలో 33 శాతం రిజర్వేషన్ కచ్చితంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరం. ప్రస్తుతం మా బ్యాచ్‌లో 141 మంది 26 మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య గతంతో పోల్చితే ఎక్కువే. ఇది మునుముందు మరింత పెరగాలని ఆశిస్తున్నా. ఇక నా విషయానికొస్తే ఐపీఎస్ అవుతానంటే కుటుంబసభ్యులెవరూ అభ్యంతరం చెప్పలేదు. పైగా అమ్మానాన్నలు మరింత ప్రోత్సాహం ఇచ్చారు. వారి సహకారం వల్లే తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించగలిగా. ట్రైనింగ్‌లో ఎంతో నేర్చుకున్నా.. ఐపీఎస్‌కు ఎంపికైన తర్వాత ట్రైనింగ్‌కు సంబంధించి మొదట్లో కాస్త కంగారుపడ్డాను. కానీ నేను ఎంతో అభిమానించిన వృత్తి కావడంతో శిక్షణలో ప్రతి రోజూ నూతనొత్సాహంతో నేర్చుకున్నా. ఈ పోలీస్ అకాడమిలో శిక్షణ ఓ అద్బుత అనుభవాన్నిచ్చింది. నేను వృత్తిలో పలు సవాళ్లను ఎదుర్కోగల ధైర్యాన్నివ్వడంతో పాటు పోలీసింగ్‌పై ఎన్నో అంశాలపై అవగాహన కలిగింది. తిరుపతి ఉప ఎన్నిక బందోబస్తుకు వెళ్లినప్పుడు శాంతిభద్రతలను డీల్ చేసే విధానం, నాసిక్ కుంభమేళాలో రద్దీని అదుపు చేసే విధానం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చాయి. ఇప్పటి దాకా కేవలం వ్యక్తుల్ని లక్ష్యం చేసుకున్న నేరాలను మాత్రమే చూశాం. కానీ ప్రస్తుతం సైబర్ నేరాలు సమాజంపై పెను ప్రభావాల్ని చూపుతున్నాయి. వెబ్సైట్లు ఎలా హాక్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ అకృత్యాలను నివారించేందుకు ఓ కామన్ సాప్ట్వేర్ ఉండాలన్నది నా నిశ్చితాభిప్రాయం. అప్పుడే ఇలాంటి దుశ్చర్యలకు దేశ వ్యాప్తంగా అడ్డుకట్ట వేయగలం. ఇక నిఫుణులు ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ వంటి వారు ఇచ్చిన ప్రత్యేక తరగతులు మాలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపాయి. ఎన్నో సామాజిక అంశాలను తెలుసుకోగలిగాము. వారిచ్చిన స్ఫూర్తితో పోలీసు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తా.