నా ఫొటొలకు రిప్లే ఇవ్వలేదో నిన్ను ఫెయిల్‌ చేస్తా | Sakshi
Sakshi News home page

నా ఫొటొలకు రిప్లే ఇవ్వలేదో నిన్ను ఫెయిల్‌ చేస్తా.. ఓ కీచక టీచర్‌ నిర్వాకం!

Published Thu, Jan 4 2024 1:48 AM

- - Sakshi

భువనగిరి క్రైం: పదో తరగతి విద్యార్థినికి ఉపాధ్యాయుడు అసభ్య మెసేజ్‌లు పంపి వేధించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన బుధవారం భువనగిరి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు, విద్యార్థిని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్‌ సమీపంలో నివసించే బెల్లి సంజయ్‌ పట్టణంలో పలు పాఠశాలల్లో పీరియడ్‌ వారీగా సైన్స్‌ సబ్జెక్ట్‌ బోధిస్తుంటాడు.

కొందరు విద్యార్థులు సబ్జెక్ట్‌లో తమ అనుమానాల నివృత్తి కోసం పలుమార్లు సంజయ్‌ను సెల్‌ఫోన్‌లో సంప్రదించేవారు. ఇదే అదనుగా భావించిన సంజయ్‌ ఓ విద్యార్థిని సెల్‌ఫోన్‌కు అసభ్య మెసేజ్‌లు పంపడం ప్రారంభించాడు. సోషల్‌ మీడియా యాప్‌ అయిన ఇన్‌స్ట్రాగామ్‌లోనూ ఆ విద్యార్థినికి ఫొటోలు పంపేవాడు. తన ఫొటోలకు రిప్లే ఇవ్వాలని.. లేదంటే ఫెయిల్‌ చేస్తానని బెదించేవాడు.

దీంతో ఆ విద్యార్థిని ఆందోళనకు గురవుతుండగా కుటుంబ సభ్యులు గుర్తించి ఏం జరిగిందని ఆరా తీయడంతో సంజయ్‌ బాగోతం బయటపడింది. దీంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు ఇదే విషయమై బుధవారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడు సంజయ్‌ని నిలదీయగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులు సంజయ్‌కి దేహశుద్ధి చేశారు.

స్కూల్‌ యాజమాన్యంపై విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌ కృ, ఎస్‌ఐ నాగరాజు పాఠశాలకు వచ్చి టీచర్‌ సంజయ్‌ని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టుకు సరెండర్‌ చేశారు.

కాగా సంజయ్‌పై గతంలోనూ ఇదేవిధంగా పలువురిని ఇబ్బందులు పెట్టినట్లు తెలుస్తోంది. నిందుతుడిని కఠినంగా శిక్షించాలని ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌, ఆలిండియా పేరెంట్స్‌ అసోసియేషన్‌ కమిటీ సభ్యులు కలెక్టర్‌, డీఈఓ, పోలీసులకు ఫిర్యాదులు, వినతి పత్రాలు సమర్పించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement