ఉదయ సముద్రంలో ఆవు కళేబరం
● నాలుగు రోజుల క్రితం పడినట్లు అనుమానం
● కుళ్లిపోయి కట్టవరకు కొట్టుకొచ్చిన ఆవు
నల్లగొండ టూటౌన్: నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ ఉదయం సముద్రంలో శనివారం ఆవు కళేబరం కనిపించడం కలకలం రేపింది. ఉమ్మడి జిల్లాలోని వందలాది గ్రామాలతో పాటు నీలగిరి మున్సిపాలిటీకి ఉదయ సముద్రం నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. ఉదయ సముద్రం వెనుక భాగం నుంచి ఆవు అందులోకి వెళ్లి మృత్యువాత పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయ సముద్రం కట్ట మధ్యలో ఉన్న తూము వరకు ఆవు కళేబరం కొట్టుకొచ్చి ఆగిపోయింది. నాలుగు రోజులు కావస్తుండడంతో ఆవు పూర్తిగా కుళ్లిపోయి కనిపిస్తోంది. ఇప్పటికే అక్కంపల్లి రిజర్వాయర్‌లో చనిపోయిన కోళ్లు వేశారనే వార్త ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. మరి ఇక్కడ చనిపోయిన ఆవును అక్కడ పడేస్తే ఇక్కడికి కొట్టుకువచ్చిందా లేక.. ఆవు ప్రమాదవశాత్తు అందులోకి వెళ్లి మరణించిందా అనేది తెలియాల్సి ఉంది. ఆవులంటే నీటిలో కూడా ఈదుకుంటూ వెళ్తుంటాయి. మరి ఈ ఆవు ఏ కారణం చేత చనిపోయిందో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార యంత్రాంగం ఆవు కళేబరాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది.
న్యాయం చేయాలని మహిళ నిరసన
నకిరేకల్: ఏఆర్ కానిస్టేబుల్ అయిన తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని గత నెల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ తగిన న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఓ మహిళ శుక్రవారం రాత్రి నకిరేకల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రికి చెందిన మొగిలి సైదులుకు చిలుకూరు మండలం ఆచార్యులగూడేనికి చెందిన నాగమణితో 2011లో వివాహం జరిగింది. నల్లగొండలో ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సైదులు ప్రస్తుతం కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సైదులు నకిరేకల్‌లోని పటేల్ నగర్‌లో ఓ ఇంట్లో మరో మహిళతో కలిసి అద్దెకు ఉంటున్న విషయాన్ని తెలుసుకున్న అతడి భార్య నాగమణి గత నెల 22న స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నెల రోజులు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి న్యాయం చేయలేదని నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తూ నకిరేకల్ పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం రాత్రి నిరసన చేపట్టింది. సీఐ రాజశేఖర్ వచ్చి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆమె అక్కడి నంచి వెళ్లిపోయింది.
ఉదయ సముద్రంలో ఆవు కళేబరం
Comments
Please login to add a commentAdd a comment