
పెద్దగట్టుకు తరలిన భక్త జనం
బస్సు సర్వీసులను
పరిశీలించిన ఆర్‌ఎం
భానుపురి (సూర్యాపేట ): పెద్దగట్టు జాతర సందర్భంగా సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ బస్ పాయింట్, బస్ సర్వీసులను ఉమ్మడి జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు సూర్యాపేట డిపో నుంచి 60 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మరిన్ని సర్వీసులు నడుపుతామన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎం సురేందర్, అసిస్టెంట్ మేనేజర్ సైదులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చివ్వెంల, సూర్యాపేట టౌన్: ప్రతి రెండేళ్లకు ఒకసారి వచ్చే దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర ఆదివారం ప్రారంభమైంది. భక్తులు భారీగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో 68 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. గట్టు పైకి వెళ్లే దారిలో మూడు వైపులా ఉన్న మెట్ల వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ పూర్తిస్థాయిలో అందుబాటులో రాకపోవడంతో భక్తులు నిరాశ చెందారు.
పార్కింగ్ ఉచితం
జాతరకు వచ్చే భక్తుల వాహనాలకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించారు. జాతర పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు భక్తుల వాహనాలకు అక్కడ ఉచితంగా పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.
పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ
జాతర పరిసరాల్లో ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం నెలకొనకుండా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ద్య సిబ్బందిని నియమించారు. వీరు చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేస్తున్నారు. గుట్టపై పొట్టేళ్లను బలిచ్చే దగ్గర వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లనున్నారు.
దాహార్తి తీర్చేందుకు భగీరథ నీరు
పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు అధికారులు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. జాతర పరిసర ప్రాంతాల్లో 12 చోట్ల కుళాయిలను ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించారు.
అందుబాటులో అత్యవసర సేవలు
ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అరికట్టడానికి జాతర పరిసరాల్లో ఫైరింజన్లను సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా 108, 104 వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. ఎలాంటి ఘటనలు జరిగినా భక్తులకు ప్రథమ చికిత్స అందించేందుకు సూర్యాపేట జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 8 ప్రదేశాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వద్ద డాక్టర్లతో పాటు ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్, సిబ్బంది అందుబాటులో ఉంటారు.
ఫ వివిధ శాఖల ఆధ్వర్యంలో
సౌకర్యాల కల్పన

పెద్దగట్టుకు తరలిన భక్త జనం
Comments
Please login to add a commentAdd a comment