
కాంగ్రెస్ నాయకుల బాహాబాహీ
చిలుకూరు: చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ఆదివారం నిర్వహించిన సీతారామచంద్రస్వామి దేవాలయం పునర్నిర్మాణ శంకుస్థాసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బేతవోలు గ్రామంలో గల శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం పునర్నిర్మాణానికి ఆదివారం ఆలయ చైర్మన్ పెండ్యాల వీరస్వామి శంకుస్థాపన చేస్తుండగా.. అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులైన మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వట్టికూటి చంద్రకళ భర్త నాగయ్య వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వట్టికూటి నాగయ్యను అవతల వర్గం నాయకులు దూషించడంతో గొడవ పెద్దదిగా మారింది. దేవాలయం లోపల జరుగుతున్న ఘర్షణ వ్యవహారం ఆలయం బయట ఉన్న ఇరువర్గాల వారికి తెలియడంతో ఒక్కసారిగా పెద్దఎత్తున ఘర్షణ వాతావరణ నెలకొంది. ఇరు వర్గాల వారు రాళ్లు విసురుకున్నార. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వట్టికూటి నాగయ్య వర్గానికి చెందిన వెంకనర్సుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఇరు వర్గాల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇరువర్గాలను అక్కడి నుంచి తరలించడంతో సమస్య సద్దమణిగింది. కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, చిలుకూరు, కోదాడ టౌన్, కోదాడ రూరల్ ఎస్‌ఐలు సురభి రాంబాబుగౌడ్, రంజిత్‌రెడ్డి, అనిల్‌రెడ్డి బేతవోలు గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రత్యేక పోలీస్ బలగాలతో పికెట్ నిర్వహించారు.
భగ్గుమన్న విభేదాలు
బేతవోలు గ్రామంలో కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్‌రెడ్డి, వట్టికూటి నాగయ్య వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన మండల పార్టీ సమావేశంలో కూడా వీరు బహిరంగంగానే ఘర్షణ పడ్డారు. గ్రామంలోని సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని పునర్నిర్మించాలని అనుకున్న నాటి నుంచి వివాదాలు ఎక్కువైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆలయ పరిధిలో సుమారు 22 ఎకరాల భూమి ఉండగా.. ఎకరం అమ్మి నూతన దేవాలయం నిర్మించాలని ఒక వర్గం వారు... గ్రామంలో చందాలు వసూలు చేసి నూతన దేవాలయం నిర్మించాలని మరో వర్గం పట్టుబట్టారు. నూతన దేవాలయం నిర్మాణం పేరుతో పురాతన దేవాలయాన్ని కూల్చి భూమి లోపల గల బంగారు నిక్షేపాలు కాజేయాలని కుట్ర పన్నుతున్నారని గ్రామంలోని మరో వర్గం అంటున్నారు. నాలుగు నెలల క్రితం దసరా పండుగ రోజు సైతం అర్థరాత్రి సమయంలో పెద్దఎత్తున ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పోలీసులు లాఠీచార్జి చేయగా.. ఏడుగురిపై కేసు నమోదు చేశారు. గురు, శుక్ర, శనివారాల్లో గ్రామంలో కనకదర్గమ్మ జాతర జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతర సజావుగా నిర్వహించడం పోలీసులకు సవాలుగా మారింది.
ఫ బేతవోలులో రాళ్లు రువ్వుకున్న
రెండు వర్గాలు
ఫ పలువురికి గాయాలు
ఫ గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment