
సమన్వయం చేసుకోవాలి
చివ్వెంల (సూర్యాపేట): పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గించకుండా అధికారులు సమన్వయం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. ఆదివారం పెద్దగట్టు వద్ద జాతర ఏర్పాట్లను జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు జాతర అని, ఎక్కువ మొత్తంలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు సమన్వయం చేసుకుంటూ జాతర విజయవంతమయ్యేలా కృషిచేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు జాతర పరిసరాలను శుభ్రం చేయాలని సూచించారు. ఎవరైనా భక్తులు తప్పిపోతే కంట్రోల్ రూమ్ వద్దకి వచ్చి తెలియజేస్తే మైక్ ద్వారా ప్రకటిస్తామన్నారు. జాతరలో దుకాణాల్లో చిన్న పిల్లలతో పనిచేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్లు శ్యామ్‌సుందర్‌రెడ్డి, కృష్ణయ్య, ఆంజనేయులు, అమీన్‌సింగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment