ప్రాణాపాయం నుంచి రక్షించేలా..
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.24 కోట్ల వ్యయంతో 80 పడకల సామర్థ్యం గల క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. రెండు బ్లాకులుగా చేపట్టిన క్రిటికల్ కేర్ యూనిట్‌ను మరో రెండు నెలల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ఆసుపత్రి వర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ యూనిట్‌లో ఆధునిక ఐసీయూ, ప్రత్యేక ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేసి సేవలు అందించేందుకు జీజీహెచ్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ యూనిట్ ప్రారంభమైతే జిల్లాలోని ప్రాణాపయస్థితిలో మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఆస్పత్రుల నుంచి అత్యవసర వైద్య సేవల కోసం రిఫర్ చేసే రోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ప్రాణాపాయస్థితిలో చికిత్స..
ప్రస్తుతం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 20 పడకలతో ఐసీయూ విభాగం, మరో 20 పడకలతో అత్యవసర విభాగంలో ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగులకు చికిత్స అందిస్తున్నారు. అయితే జిల్లాలోని ఏరియా ఆసుపత్రి నుంచి అత్యవసర వైద్య సేవల కోసం రిఫర్ చేస్తున్న రోగులకు మంచాలు సరిపోవడం లేదు. దీంతో వారిని హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌కు రెఫర్ చేస్తున్నారు. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.
ఫ జీజీహెచ్‌లో పూర్తికావొస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులు
ఫ 80 పడకల సామర్థ్యంతో రెండు బ్లాక్‌ల నిర్మాణం
ఫ నెల రోజుల్లో అందుబాటులోకి రానున్న ఒక బ్లాక్
ఒక యూనిట్‌లో తొలుత ఓపీ సేవలు..
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నూతన భవన నిర్మాణం కోసం పాత భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం కూల్చివేశారు. ప్రస్తుతం పాత భవనంలో నిర్వహిస్తున్న ఓపీ సేవలు, బ్లడ్ బ్యాంకు, తెలంగాణ హబ్‌లకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు వరకు క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఒక బ్లాక్‌లో అవుట్ పేషెంట్ సేవలను, బ్లడ్ బ్యాంకు, తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను నిర్వహించేందుకు ఆసుపత్రి వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. మరో బ్లాక్‌లో రెండు నెలల తర్వాత క్రిటికల్ కేర్ సెంటర్ సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కూల్చివేసిన పాతభవనం స్థానంలో కొత్త భవన నిర్మాణం పూర్తయితే క్రిటికల్ కేర్ యూనిట్‌లో రెండు బ్లాక్‌లు అందుబాటులోకి వచ్చి 80 పడకల సామర్థ్యంతో అత్యవసర సేవలు అందనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment