మార్మోగిన ఓ లింగా.. నామస్మరణ
సూర్యాపేట, చివ్వెంల, సూర్యాపేటటౌన్, భానుపురి, పెన్‌పహాడ్ : తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరైన దురాజ్‌పల్లి లింగమంతులస్వామి(పెద్దగట్టు) జాతరకు రెండో రోజు సోమవారం భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. తమ ఇష్టదైవం లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా తరలివచ్చి సందడి చేశారు.
● ఎర్రబడ్డ పెద్దగట్టు
భక్తులు యాటలను బలి ఇవ్వడంతో పెద్దగట్టు ఎర్రబడింది. యాదవులు స్వామివారికి కొబ్బరికాయలు, బోనాలు చెల్లించి మొక్కులు చెల్లించుకోగా, అమ్మవారికి యాటలను బలి ఇచ్చారు. గతంలో గట్టుకు ఒకవైపు కేటాయించిన ప్రదేశంలో మాత్రమే యాటలను బలి ఇచ్చేవారు. కానీ ఈసారి భక్తులు తమకు నచ్చిన చోట గుట్ట చుట్టూ యాటలను బలి ఇచ్చారు. దీంతో యాటల రక్తంతో గుట్ట ఎర్రబడింది. జాతరలో రెండు రోజుల్లో తప్పిపోయిన 25 మంది చిన్న పిల్లలను శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
● వెలవెలబోయిన కోనేరు
గుట్ట పైన కోనేరులో భక్తులు స్థానాలను ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు గుట్ట పైన ఉన్న కోనేరు ఏమాత్రం సరిపోవడం లేదని భావించి గుట్ట కింద గతంలోనే కోనేరును నిర్మించారు. అయితే కోనేరులో స్నానాలు చేసే సమయంలో భక్తులకు ఏమైనా జరుగుతుందన్న ముందస్తు చర్యలో భాగంగా ఈ కోనేరుకు తాళాలు వేశారు. దీంతో కోనేరు వెలవెలబోయింది.
● ఆకట్టుకున్న శివసత్తుల నృత్యాలు
లింగమంతుల జాతరలో శివసత్తులు సందడి చేశారు. లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లికి బోనం సమర్పించేందుకు భక్తులు గంపలతో వచ్చే సమయంలో శివసత్తులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
● పనిచేయని షవర్లు
లింగమంతులస్వామి వారిని దర్శించుకునే ముందు భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా గుట్ట పైన ఏర్పాటు చేసిన షవర్లు పనిచేయకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక తాగునీటి కోసం ఏర్పాటు చేసిన కుళాయిల వద్దనే భక్తులు స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి వెళ్లారు. పెద్దగట్టు జాతరలో అంటువ్యాధులు ప్రబలకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. జాతరకు వచ్చిన భక్తులు వదిలేసిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులు సేకరించి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.
పెద్దగట్టుకు భారీగా తరలివచ్చిన భక్త జనం
Comments
Please login to add a commentAdd a comment