మహాకుంభాభిషేక సంప్రోక్షణ వైభవంగా నిర్వహించాలి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జరిగే బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆలయ ఈఓ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను పర్యవేక్షిస్తూ, ప్రొటోకాల్ ప్రకారంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడపడంతో పాటు రోడ్లపై పార్కింగ్ చేయకుండా చూడాలన్నారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తూ యాదగిరి క్షేత్ర వైభవాన్ని ప్రపంచానికి చాటాలన్నారు. అంతకుముందు మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సమీక్షలో జెడ్పీ సీఈఓ శోభారాణి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ రమేష్ తహసీల్లార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment