ఫ మహిళా సంఘాల డబ్బులు బ్యాంకులో చెల్లించకుండా మోసం
ఫ రెండు రోజుల క్రితం ఐకేపీ అధికారులతో పాటు
వీఓఏను నిర్బంధించగా విడిపించిన పోలీసులు
మునుగోడు: మునుగోడు మండలం కచలాపురం గ్రామంలో మహిళా సంఘాల సభ్యుల డబ్బులను బ్యాంకులో జమచేయకుండా సొంతానికి వాడుకున్న ఆ గ్రామ వీఓఏ సుఖేందర్ పరారీలో ఉన్నట్లు సమచారం. మహిళా సంఘాల సభ్యులు శ్రీనిధి రుణాలతో పాటు ఇతర రుణాల వాయిదా డబ్బులను ప్రతి నెలా రూ.90వేల వరకు వీఓఏకు చెల్లించగా.. అతడు కేవలం రూ.40వేల నుంచి రూ.50వేల వరకు మాత్రమే బ్యాంకులో జమచేసి మిగిలిన డబ్బులు తన సొంతానికి వాడుకున్నాడు. ఇది గుర్తించిన ఐకేపీ ఏపీఎంతో పాటు సీసీ సోమవారం కచలాపురంలో సమావేశం ఏర్పాటు చేసి వీఓఏ రూ.11లక్షలు వాడుకున్నట్లు నిర్దారించారు. దీంతో ఆగ్రహించిన మహిళా సంఘాల సభ్యులు అదే రోజు ఐకేపీ అధికారులతో పాటు వీఓఏని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మహిళలకు సర్దిచెప్పి వారిని విడిపించారు.
ఐ.పీ. పెట్టేందుకు ప్రయత్నం..
ఐకేపీ అధికారులు వీఓఏ సుఖేందర్‌పై మునుగోడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. కచలాపురం గ్రామంలోని కొందరు పెద్దలు, అతడి కుటుంబ సభ్యులు మహిళ సంఘాల సభ్యులకు ఇవ్వాల్సిన డబ్బులు తాము ఇప్పిస్తామని, అప్పటి వరకు కేసు నమోదు చేయొద్దని జమానతుపై తీసుకెళ్లారు. కానీ రెండు రోజుల నుంచి అతడు గ్రామంలో కనిపించడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అతడు మహిళా సంఘాల సభ్యులకు చెల్లించాల్సిన డబ్బులు ఇప్పట్లో చెల్లించకుండా కోర్టు ద్వారా ఐపీ(ఇన్‌సాల్వెన్సి పిటిషన్) పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. వీఓఏ సుఖేందర్‌కు బయట అప్పులు కూడా అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment