వరి.. తడారి.. | - | Sakshi
Sakshi News home page

వరి.. తడారి..

Published Thu, Feb 20 2025 8:35 AM | Last Updated on Thu, Feb 20 2025 8:32 AM

వరి..

వరి.. తడారి..

అడుగంటిన భూగర్భజలాలు.. ఎండిపోతున్న పొలాలు

వరిపొలంలో గేదెను మేపుతున్న ఈయన మునుగోడు మండలంలోని పులిపలుపుల గ్రామానికి చెందిన రైతు సింగం మల్లేష్‌. తనకున్న 6 ఎకరాల్లో వరిసాగుచేశాడు. నాటేసిన సమయంలో బోరు నుంచి నీరు బాగానే వచ్చింది. ఇటీవల ఎండ తీవ్రత పెరగడంతో బోర్లలో నీరు తగ్గిపోయింది. సరిపడా రాకపోవడంతో దాదాపు 3 ఎకరాల్లో పంట పూర్తిగా ఎండిపోయింది. చేసేది ఏమిలేక ఎండిన వరి పొలంలో తన పశువులను మేపుతున్నాడు. ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని వాపోతున్నాడు.

400 ఫీట్లు బోరువేసినా చుక్కనీరు రాలే..

గట్టుప్పల్‌ మండలం అంతంపేట గ్రామానికి చెందిన మాదగాని అంజయ్య తనకున్న రెండెకరాల్లో వరి వేశాడు. మొదట్లో పంట బాగానే ఉంది. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయి, బోర్ల నుంచి నీరు రావడం తగ్గిపోయి, వారం రోజుల నుంచి పంటలు ఎండిపోతున్నాయి. సమీపంలో 400 ఫీట్ల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు రావడం లేదని అంజయ్య వాపోయాడు. నల్లగొండ మండంలోనూ భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు సరిగా నీరు పోయకపోవడంతో పంటలకు సరిపడా నీరందడం లేదు. ఓ రైతు నాలుగు బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నాడు.

నాలుగు బోర్లు వేసినా నీరులేదు

నాకున్న రెండెకరాల్లో వరి వేశాను. రెండు బోర్లలో ఒక్కసారిగా నీరు తగ్గిపోయింది. రూ.లక్షన్నర అప్పు చేసి మరో 4 బోర్లు వేశాను. ఒక్క దాంట్లోనూ నీరు రాలేదు. నీరందకపోవడంతో ఎకరం పొలం ఎండిపోయింది.

– ఓరుగంటి పాండు, అప్పాజీపేట

ట్యాంకర్లతో నీరుపెడుతున్నా

నాకున్న నాలుగెకరాలతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట సాగుచేశాను. ఇప్పుడు బోర్ల నుంచి నీరు రావడం లేదు. పంట ఎండిపోతోంది. దీంతో ట్యాంకర్‌తో నీరు తెచ్చి పొలం పారిస్తున్నా.

– ఈరటి వెంకట్‌ యాదవ్‌,

పెద్దకాపర్తి, చిట్యాల

పంటలు సాగుచేసి అప్పులపాలయ్యాం

రెండెకరాలలో వరి సాగుచేశాను. చేను పొట్టదశకు వచ్చే సమయానికి రెండు బోర్లలో నీరు తగ్గిపోయింది. దీంతో వరిచేను మొత్తం ఎండిపోయింది. కొత్తగా బోర్లు వేద్దామంటే పడే పరిస్థితి లేదు. చేసేదేమీ లేక వరిచేనును వదిలేశాను. పంట పెట్టుబడి కోసం రూ.60 వేలకు పైగా అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.

– జాల ఉపేందర్‌, వల్లాల, శాలిగౌరారం

వరి పంట ఎండిపోతోంది

గుర్రప్పగూడె శివారులో నాలుగు ఎకరాల్లో వరి సాగుచేశాను. ప్రస్తుతం బోర్లు సరిగ్గా పోయకపోవడంతో ఎకరంన్నర పొలం ఎండిపోయింది. మిగిలిన పొలానికై నా నీరు సరిపడ వస్తదనే నమ్మకం లేదు. తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది.

– తగుళ్ల మల్లయ్య, సర్వారం

వట్టిపోతున్న బోర్లు.. అన్నదాతల దిగాలు

పొట్టకొచ్చిన దశలో వందల ఎకరాల్లో ఎండుతున్న వరిచేలు

ప్రత్యామ్నాయం లేక పంటలను

వదులుకుంటున్న రైతులు

ట్యాంకర్ల ద్వారా నీరు పోస్తున్నా.. కానరాని ప్రయోజనం

జనవరి నెలలో భూగర్భ జలమట్టం ఇలా..(మీటర్లలో)

మండలం గతేడాది ఈసారి పడిపోయింది

నాంపల్లి 9.44 12.62 3.18

మర్రిగూడ 8.36 9.99 1.63

కొండమల్లేపల్లి 4.82 6.0 1.18

మునుగోడు 7.55 8.51 0.96

కట్టంగూర్‌ 8.76 9.54 0.78

చింతపల్లి 10.15 10.86 0.71

దేవరకొండ 7,28 7,83 0.55

గుండ్లపల్లి 6.87 6.35 0.48

శాలిగౌరారం 4.20 4.53 0.33

మాడుగులపల్లి 7.94 8.03 0.10

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎండల తీవ్రత పెరుగుతుండటంతో భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. దీంతో బోర్లు వట్టిపోతుండటంతో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పంట ఎండిపోతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో గత ఏడాది యాసంగిలో 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి 5.12 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.

పాతాళానికి భూగర్భ జలాలు

నల్లగొండ జిల్లాలో 33 మండలాలు ఉంటే.. పది మండలాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. నాంపల్లి మండలంలో గతేడాది జనవరి కంటే ఈ జనవరిలో అదనంగా 3.18 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. మర్రిగూడ, కొండమల్లేపల్లి, మునుగోడు, కట్టంగూర్‌, చింతపల్లి, దేవరకొండ, గుండపల్లి, శాలిగౌరారం, మాడుగులపల్లి మండలాల్లోనూ భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఫిబ్రవరి నెలలో అవి మరింతగా లోతుకు పడిపోయి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

శాలిగౌరారంలో భారీగా నష్టం

శాలిగౌరారం మండలంలో సాగునీటి వనరులు సరిగ్గా లేని భైరవునిబండ, తక్కెళ్లపహాడ్‌, ఆకారం, వల్లాల, పెర్కకొండారం గ్రామాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మండలంలో ఈ సీజన్‌లో 19 వేల ఎకరాలలో వరి పంట సాగు చేయగా, అందులో దాదాపు 400 ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు కొత్తగా బోర్లు వేసినా పడకపోవడంతో రైతులు పంటలను వదిలేయాల్సి వస్తోంది.

ట్యాంకర్ల ద్వారా నీరు

చిట్యాల మండలంలో 15 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, పలు గ్రామాల్లో నీరందక పంట ఎండిపోతోంది. కొంతమంది రైతులు ట్యాంకర్ల నీటిని పోస్తున్నారు. పెద్దకాపర్తిలో దాదాపు 20 మంది రైతుల బోర్లు వట్టిపోయాయి. దీంతో ఆ గ్రామంలో దాదాపు 50 ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. మునుగోడు మండలంలోనూ పంటలు ఎండిపోతున్నాయి. వర్షాలు పెద్దగా పడక, భూగర్భ జలాలు పెరుగకపోవడం, చెరువులు, కుంటల్లో సరిపడ నీరు లేకపోవడంతో బోర్లు నీరుపోయడం లేదు.

400 ఎకరాల్లో ఎండిన వరి

నార్కట్‌పల్లి మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. కొండపాకగూడెం, శేరుబావిగూడెం, ఎల్లారెడ్డిగూడెం, చెర్వుగట్టు, నెమ్మని, మాదవఎడవల్లి గ్రామాల్లో బోర్లపై ఆధారపడి వేసిన వరి పంట ఎండిపోయి పొలాలు నెర్రెలుబారుతున్నాయి.పొలాల్లో కొందరు రైతులు గొర్రెలు, మేకలు మేపుతున్నారు. మండల వ్యాప్తంగా 20 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో 400 ఎకరాల్లో వరి పంట ఎండిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తిప్పర్తి మండలంలోనూ భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయి. మండలంలోని సర్వారం గ్రామంలో భూగర్బ జలాలు అడుగు అంటడంతో గుర్రప్పగూడెం ప్రాంతంలో బోర్లు వట్టిపోయాయి. పొలాలు పొట్ట దశకు రావడంతో నీరు అధికంగా అవసరం అవుతుందని, ఈ సమయంలో బోర్లలో నీరు తగ్గిపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వరి.. తడారి..1
1/10

వరి.. తడారి..

వరి.. తడారి..2
2/10

వరి.. తడారి..

వరి.. తడారి..3
3/10

వరి.. తడారి..

వరి.. తడారి..4
4/10

వరి.. తడారి..

వరి.. తడారి..5
5/10

వరి.. తడారి..

వరి.. తడారి..6
6/10

వరి.. తడారి..

వరి.. తడారి..7
7/10

వరి.. తడారి..

వరి.. తడారి..8
8/10

వరి.. తడారి..

వరి.. తడారి..9
9/10

వరి.. తడారి..

వరి.. తడారి..10
10/10

వరి.. తడారి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement