స్వస్తివాచనం.. విష్వక్సేనారాధన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం ప్రధానాలయంలోని ముఖ మండపంలో స్వస్తివాచనం, విష్వక్సేన ఆరాధనతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ముఖ మండపంతో పాటు గర్భాలయంలో, ఆలయ పరిసరాల్లో పుణ్యాహ వాచనం జరిపించారు. ప్రధానాలయ ముఖ మండపం నుంచి యాగశాలకు ఊరేగింపుగా శ్రీస్వామి అమ్మవార్లను ప్రత్యేక సేవపై తీసుకువచ్చారు. యాగశాల వద్ద ప్రవేశ పూజను నిర్వహించి యాగశాల మంటపం ఎదుట స్వయంభూ అగ్ని సృష్టించే కార్యక్రమం చేపట్టారు. అనంతరం పంచ కుండాత్మక యాగానికి అగ్ని ప్రతిష్ఠాపన చేసి హోమాధి పూజలు జరిపించారు. అదేవిధంగా రాత్రికి శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, ద్వారాది కుంభార్చన, బింబ, కుంభ, మండల, అగ్ని ఆరాధన, మూర్తి మంత్ర హోమాలు, వారుణానువాక హోమం చేసి, జలాధివాసం
నిర్వహించారు.
భక్తులకు సదుపాయాలు కల్పించాలి
కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయ అధికారులు సదుపాయాలు కల్పించాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ ఆదేశించారు. సంప్రోక్షణ ఉత్సవాల్లో భాగంగా ఈ సందర్భంగా కొండపైన గల దేవాలయ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భాస్కర్‌రావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 23న మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు అధికంగా వస్తారని, వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. పలు అంశాలపై అధికారులతో చర్చించారు. అంతకు ముందు కొండ కింద హెలిపాడ్ స్థలం, కొండపైన స్వాగత తోరణానికి ఇరువైపులా వేస్తున్న రంగులు, ఘాట్‌రోడ్డు, ప్రధానాలయాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఏసీపీ రమేష్, ప్రధానార్చకులు, జిల్లా అధికారులు, ఆలయాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ యాదగిరి క్షేత్రంలో ప్రారంభమైన మహా కుంభాభిషేక సంప్రోక్షణ
ఫ పూజల్లో పాల్గొన్న దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్
స్వస్తివాచనం.. విష్వక్సేనారాధన
Comments
Please login to add a commentAdd a comment