మద్యంపై.. మహిళల సమరం
బెల్టు షాపులు బంద్ చేయించిన అతివలు
ఎక్కడమ్మా నువ్వు లేనిది.. ఏమిటీ నువ్వు చెయ్యలేనిదీ. మహిళలు ఏకమైతే సాధించలేనిది ఏమీ లేదు. గ్రామాల్లో మద్యం మహమ్మారికి యువత బానిస కావడం, కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అవడంతో ఆ ఊళ్లలో మహిళలు కొంగు నడుముకు చుట్టారు. మద్యం మహమ్మారిని పారదోలాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో నిర్వహించే బెల్టు దుకాణాలపై సమరం సాగించారు. మద్యం అమ్మకాలను అడ్డుకుని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు చిట్యాల మండలం ఏపూరు, రాజాపేట మండలం పాముకుంట మహిళలు.
– చిట్యాల, రాజాపేట
నెలరోజులుగా మద్యం
అమ్మడం లేదు
మా గ్రామంలో పదిహేనుకు పైగా బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మేవారు. గ్రామంలోని యువతతో పాటు పెద్దవారు సైతం మద్యానికి బానిసై ఆర్థికంగా.. ఆరోగ్య పరంగా నష్టపోతున్నారు. ఇటీవల మద్యం మత్తులో ఓ యువకుడు మృతిచెందాడు. వెంటనే గ్రామంలో బెల్టు దుకాణాలను అరికట్టాలని మహిళలమంతా కలిసి ర్యాలీ నిర్వహించాం. మద్యం అమ్మితే జరిమానా విధించాలని తీర్మానించాం. నెల రోజులుగా గ్రామంలోని బెల్టు దుకాణాలను తొలగించారు. మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి.
– బొంగు శ్రీలత, మహిళా సంఘం
ప్రధానకార్యదర్శి, ఏపూరు
ఫ గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరిపితే జరిమానా విధించాలని నిర్ణయం
ఫ ఆదర్శంగా నిలుస్తున్న చిట్యాల మండలం ఏపూరు, రాజాపేట మండలం పాముకుంట
చిట్యాల మండలం ఏపూరు గ్రామం జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో 1950 మందికిపైగా జనాభా ఉంది. ఈ గ్రామానికి చెందిన పురుషులు ఎక్కువగా డ్రైవర్లుగా, కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో పదిహేనుకుపైగా బెల్టుషాపులు ఉన్నాయి. వీటిలో అన్ని రకాల బ్రాండ్‌లకు చెందిన మద్యం లభిస్తుంది. దీంతో ఆ గ్రామంలోని యువకులతో పాటు చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేసే వందలాది మంది కార్మికులు సైతం ఇక్కడ విచ్చలవిడిగా మద్యం సేవిస్తుంటారు. ఆ గ్రామానికి చెందిన పలువురు మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరికొందరు చేసిన పనిచేసిన డబ్బులను మద్యానికి ఖర్చు చేస్తూ కుటుంబాలను పట్టించుకోవటం లేదు. దీంతో ఆ గ్రామ మహిళలంతా ఏకమై మద్యం మహమ్మారిని పారదోలాలని నడుం బిగించారు.
బెల్టు దుకాణాలు మూసివేయాలని హెచ్చరిక..
ఏపూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు (20) ఫిబ్రవరి 12న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ యువకుడి మృతికి మద్యం మహమ్మారే కారణమని భావించారు. ఆ యువకుడు మృతి చెందిన రోజే గ్రామంలో మద్యపాన నిషేధానికి నడుం బిగించారు. ఆ గ్రామంలోని మహిళ సంఘం అధ్యక్షురాలు వలిగొండ సునీత, ప్రధానకార్యదర్శి బొంగు శ్రీలత, వీబీకే బండ అనురాధ ఆధ్వర్యంలో మహిళలంతా ఏకమై బెల్టు దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద సమావేశమై నిరసన తెలిపారు. గ్రామంలో బెల్టు దుకాణాల వద్దకు వెళ్లి మద్యం అమ్మొదని హెచ్చరించారు. గ్రామంలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తే రూ.లక్ష, మద్యం తాగిన వారికి రూ.20 వేలు జరిమానా.. మద్యం అమ్మినవారి సమాచారం అందిస్తే రూ.10 వేల ప్రోత్సాహకం అందజేస్తామని తీర్మానించారు. ఆ రోజు నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి.
మద్యంపై.. మహిళల సమరం
మద్యంపై.. మహిళల సమరం
Comments
Please login to add a commentAdd a comment