ఆరుగురు సీఐల బదిలీ
నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు మంగళవారం జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా మల్టీ జోన్–2లో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న కె.ఆదిరెడ్డిని నాంపల్లి సీఐగా, నల్లగొండ ట్రాఫిక్ పీఎస్‌లో పనిచేసే రాజును చండూరు సీఐగా, పీసీఆర్ నల్లగొండలో పనిచేసే కె.శివశంకర్‌ను సూర్యాపేట జిల్లా కోదాడ సీఐగా, నాంపల్లి సీఐగా పనిచేస్తున్న అనంతుల నవీన్‌కుమార్‌ను హైదరాబాద్ సిటీ కమిషరేట్‌కు, చండూరు సీఐగా పని చేస్తున్న ఎ.వెంకటయ్యను, కోదాడ టౌన్ సీఐగా పని చేస్తున్న రాములును హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేశారు.
ఏప్రిల్ 11 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ 11 నుంచి నిర్వహించనున్నట్లు ఎంజీయూ సీఓఈ డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11న నుంచి డిగ్రీ ఒకటవ సెమిస్టర్, మూడవ సెమిస్టర్ పరీక్షలు ఉంటాయని, 16 నుంచి ఐదవ సెమిస్టర్, 15 నుంచి రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్‌లాగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంజీయూ పరిధిలోని సీబీఎస్సీ విధానంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని వారికి చివరి అవకాశం కల్పిస్తూ.. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల టైం టేబుల్, వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
పెండింగ్ కేసులు
క్లీయర్ చేయాలి : ఎస్పీ
నల్లగొండ : పెండింగ్ కేసులను వెంటవెంటనే క్లీయర్ చేయాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళికాబద్దంగా కృషి చేయాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశోధన చేసి ఫైనల్ చేయాలని సూచించారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. దొంగతనాలు జరగకుండా పగలు, రాత్రి పెట్రోలింగ్ చేయాలన్నారు. పాత నేరస్తుల కదలికపై నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, డీఎస్‌పీలు రమేష్, విఠల్‌రెడ్డి, శివరాంరెడ్డి, రాజశేఖరరాజు, సైదా, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
పరువు హత్యలు చేసేవారికి గుణపాఠం
చిట్యాల : ప్రణయ్ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు పరువు హత్యలు చేసే వారికి తగిన గుణపాఠమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాలలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు, న్యాయస్థానాల కృషి ఫలితంగానే ప్రణయ్ హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష, యావజ్జీవ కారగార శిక్ష పడిందన్నారు. కులాంతర వివాహాలను ప్రజా సంఘాలు, ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ఆయన కోరారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, నాయకులు ఐతరాజు నర్సింహ, బొబ్బలి సుధాకర్‌రెడ్డి, ఐతరాజు యాదయ్య, మెట్టు నర్సింహ, పాలమాకుల అర్జున్, శేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment