రాజీ మార్గంతో కేసులకు శాశ్వత పరిష్కారం
రామగిరి(నల్లగొండ) : రాజీ మార్గంతో కేసులకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. న్యాయ సేవాదికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయలోక్ అదాలత్ నిర్వహించారు. నల్లగొండ కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు లోక్ అదాలత్‌ను ప్రారంభించి కక్షిదారులకు రాజీ పత్రాలను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా సివిల్ 40, క్రిమినల్ 5,807, వెహికిల్ ఇన్యూరెన్స్ 95, బ్యాంక్ 3, సైబర్ క్రైం 29, ట్రాన్స్‌కో 100, ట్రాఫిక్ చలాన్ 12,879 కేసులను పరిష్కరించారు. ఇందులో ఇన్సూరెన్స్ కేసుల్లో రూ.4,30,82,000 నష్ట పరిహారం ఇప్పించారు. ఇతర కేసుల్లో రూ.2,58,456 రికవరీ చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బి.దీప్తి ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment