జీజీహెచ్‌లో భద్రత ఏదీ!
ఆస్పత్రి ఆవరణలో సీసీ కెమెరాల తొలగింపు
సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిఘా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆస్పత్రి ఆవరణ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం . ఇంతకుముందు ఉన్న కెమెరాలను మెడికల్ కళాశాల వారు తీసుకుపోయారు.
–డాక్టర్ అరుణకుమారి,
జీజీహెచ్ సూపరింటెండెంట్
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో రోగుల భద్రతకు భరోసా లేకుండా పోయింది. నిత్యం ఔట్ పేషంట్లు 1500 వరకు, ఇన్ పేషంట్లు 500 నుంచి 600 వరకు జీజీహెచ్‌కు వస్తుంటారు. దీనికితోడు జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల నుంచి రిఫర్ చేసిన కేసులు వస్తుంటాయి. ఇంతమంది రోగులు వస్తున్న 800 పడకల ఈ ఆస్పత్రికి భద్రత లేకుండా పోయింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రంతోపాటు జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఐసీయూ, ఎమర్జెన్సీ, సర్జరీ, వెల్‌నెస్ సెంటర్, ఫోరెన్సిక్, పోస్టుమార్టం, తెలంగాణ హబ్ తదితర విభాగాలు జీజీహెచ్‌లో ఉన్నాయి. వీటన్నింటికి తగ్గట్టుగా సరైన సెక్యూరిటీ, అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కేవలం మాతాశిశు ఆరోగ్య కేంద్రంతోపాటు ఇతర వార్డుల్లో మాత్రమే 25 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అందుతో ఎన్ని కెమెరాలు పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి.
ఆస్పత్రి ఆవరణలో లేని సీసీ కెమెరాలు
జిల్లా కేంద్ర ప్రధాన ఆస్పత్రికి నిత్యం వేల సంఖ్యలో రోగులతోపాటు వారి సహాయకులు, వైద్యులు, మెడికల్ కళాశాల విద్యార్థులు, ఇతరులు వస్తుంటారు. ఆస్పత్రిలో భద్రత పర్యవేక్షణలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ప్రధాన గేట్లు, ఇతర పరిసరాలను పర్యవేక్షించడానికి సీసీ కెమెరాల అవసరం చాలా ఉంటుంది. కానీ జీజీహెచ్ అధికారులు వీటిని పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు జీజీహెచ్‌లో మెడికల్ కళాశాల ఉన్నప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆస్పత్రి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల మెడికల్ కళాశాల నూతన భవనంలోకి మారిన తరువాత.. ఆస్పత్రి ఆవరణతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న 25 సీసీ కెమెరాలను కళాశాల అధికారులు తీసుకెళ్లినట్లు తెలిసింది దీంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రతపై నిఘా లేకుండా పోయింది.
ఫ రాత్రి వేళ రెచ్చిపోతున్న దొంగలు
ఫ భద్రత లోపం కారణంగానే ఇటీవల బాలుడి కిడ్నాప్ !
ఫ వరుస ఘటనలతో భయాందోళనలో రోగులు
సెల్‌ఫోన్లు, పర్సులు మాయం..
సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆస్పత్రిలో రాత్రిపూట దొంగలు రెచ్చిపోతున్నారు. వార్డుల్లో రోగుల సహాయకుల సెల్‌ఫోన్లు, పర్సులతోపాటు బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాలను దొంగిలించిన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆస్పత్రిలోని టన్నుల కొద్ది పాత ఇనుప సామగ్రి దొంగిలించారు. అదేవిధంగా ఆస్పత్రి ఆవరణలో ఎవరుపడితే వారు రాత్రిపూట నిద్రించడంతోపాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇన్‌పేషంట్ల వరకు మాత్రమే నిఘా ఏర్పాటు చేసి ఆస్పత్రి ఆవరణలో ఉన్న వారిపై ఎలాంటి నిఘా ఏర్పాటు చేయకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ నెల 4న బాలుడి కిడ్నాప్ సంఘటన నిఘా లోపం కారణంగానే జరిగిందని పేర్కొనవచ్చు. ఇకనైనా ఆస్పత్రి వర్గాలు స్పందించి జీజీహెచ్‌లో సరైన భద్రత కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జీజీహెచ్‌లో భద్రత ఏదీ!
Comments
Please login to add a commentAdd a comment