కేసీఆర్‌ లేకపోతే తెలంగాణే లేదు | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ లేకపోతే తెలంగాణే లేదు

Published Fri, Mar 21 2025 1:50 AM | Last Updated on Fri, Mar 21 2025 1:44 AM

సూర్యాపేటటౌన్‌ : ‘కేసీఆర్‌.. పార్టీ పెట్టి సునామీ సృష్టించారు... కేసీఆరే లేకపోతే తెలంగాణ లేదు.. ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వారికి ఆ పదవులే రాకపోయేవి’ అని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏప్రిల్‌ 27న వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభ విజయవంతానికి గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ, మరో వైపు చంద్రబాబు లాంటి వారి సవాళ్ల మధ్య కేసీఆర్‌ తెలంగాణ ప్రజల కోసం సాహసం చేసి పార్టీ పెట్టారన్నారు. 14 ఏళ్లు సుదీర్ఘపోరాటం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. కేసీఆర్‌ మోకాలు ఎత్తుకు కూడా సరిపోని వాళ్లు ఆయన గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.5లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే.. ఇప్పుడు ఇక్కడ నీళ్ల మంత్రి ఉన్నా చుక్కనీరు తేలేకపోతున్నారని, దీంతో పంటలు ఎండిపోయి రైతులు గోసపడుతున్నారన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చాపల కూర చేయించుకొని తింటున్నాడని విమర్శించారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు ఒక్కొక్క గ్రామం నుంచి బండ్లు కట్టుకుని తరలిరావాలని కోరారు. ఈ సభ చూస్తే కాంగ్రెస్‌, బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలన్నారు. వరంగల్‌ బహిరంగ సభ తర్వాత వెంటనే సభ్యత్వ నమోదుతోపాటు గ్రామ మండల కమిటీలు ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ ఏడాది కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటాలు చేద్దామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ ఏడాదిని పోరాట నామ సంవత్సరంగా పిలుచుకుందామని అన్నారు.

దేశానికి కేసీఆరే దిక్సూచి: జగదీష్‌రెడ్డి

దేశానికి దిక్సూచిలా కేసీఆర్‌ నిలుస్తారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వెనుకబాటును చూసి చలించి గులాబీ జెండా ఎత్తారని, ఒక్కడిగా బయలుదేరి నేడు సముద్రంలా మారారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం వెనుకబాటుకు గురవుతోందని, ఇక్కడ ఆయన శిష్యుడు రేవంత్‌ అదే బాటలో పయనిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ వచ్చే నెల 27న జరిగే వరంగల్‌ బహిరంగ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలిరావాలన్నారు. అంతకు ముందు జనగామ క్రాస్‌రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్‌, బొల్లం మల్లయ్య యాదవ్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కరరావు, రవీంద్రకుమార్‌, నోముల భగత్‌, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

14 ఏళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించారు

ఫ బీఆర్‌ఎస్‌ హయాంలో ఉమ్మడి జిల్లాలో 2.5లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం

ఫ ఇప్పుడు ఇక్కడ నీళ్ల మంత్రి ఉన్నా

చుక్కనీరు తేలేకపోతుండు

ఫ సూర్యాపేట సన్నాహక సమావేశంలో

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement