రామగిరి(నల్లగొండ) : యూజీసీ – 2025 మార్గదర్శకాలను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అనిల్ అబ్రహం డిమాండ్ చేశారు. ఎంఫిల్, పీహెచ్‌డీ ఇంక్రిమెంట్ల రద్దుకు వ్యతిరేకంగా సోమవారం ఎన్జీ కళాశాల ఎదుట అసిస్టెంట్ ప్రొఫెసర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్‌కు పీహెచ్‌డీ తప్పనిసరి చేయడం సరికాదన్నారు. నూతన విద్యా విధానం–2020పై నిష్ణాతులైన ప్రొఫెసర్లను చర్చకు ఆహ్వానించి విధి విధానాలను ఖరారు చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, డాక్టర్ అనిల్ బొజ్జ, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ పరంగి రవికుమార్, డాక్టర్ అంతటి శ్రీనివాస్, సీఓఈ బత్తిని నాగరాజు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న కుమార్, అధ్యాపకులు ముని స్వామీ, కిరీటం, శ్రీధర్, సుధాకర్, మల్లేశం, జ్యోత్స్న, భాగ్యలక్ష్మి, శంకర్ తదితరులున్నారు.