టాటా ఏస్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరికి గాయాలు
కొండమల్లేపల్లి: టాటా ఏస్ వాహనాన్ని కారు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం జోగ్యతండా వద్ద సోమవారం జరిగింది. పెద్దఅడిశర్లపల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు కొండమల్లేపల్లి మండలం జోగ్యతండా సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి హైదరాబాద్ నుంచి కొండమల్లేపల్లి వైపు కుక్కర్లు, మిక్సీలు తదితర సామగ్రితో వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ డ్రైవర్ మల్లేష్ కాలు విరగడంతో చికిత్స నిమిత్తం అతడిని స్థానికులు దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ రామ్మూర్తి తెలిపారు.
హత్య కేసులో నిందితుడికి పదేళ్లు జైలుశిక్ష
భువనగిరి: భార్యాభర్తను హత్య కేసిన కేసులో నిందితుడికి పదేళ్లు జైలుశిక్ష, రూ.20వలే జరిమానా విధిస్తూ భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జయరాజు సోమవారం తీర్పు వెలువరించారు. భువనగిరి రూరల్ ఎస్‌హెచ్‌ఓ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తుక్కాపురం గ్రామానికి చెందిన రాసాల బస్వయ్య గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2023 అక్టోబర్ 13వ తేదీన బస్వయ్య తన ఇంటి వద్ద ఉన్న గొర్రెల దొడ్డి నుంచి గొర్రెలను మేపేందుకు తోలుకెళ్తున్నాడు. ఈ క్రమంలో బస్వయ్య ఇంటి పక్కనే ఉంటున్న రాసాల రాజమల్లు తన ఇంటి ముందు నుంచి గొర్రెలను తోలుకపోవడం వల్ల దుమ్ము లేచి ఇబ్బందులు పడుతున్నామని బస్వయ్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటామాట పెరిగి రాజమల్లు అక్కడే ఉన్న పారతో బస్వయ్య తలపై కొట్టాడు. అదే సమయంలో అడ్డుగా వచ్చిన బస్వయ్య భార్య తిరుపతమ్మ తలపై కూడా కొట్టాడు. దీంతో బస్వయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. తిరుపతమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతుడి అల్లుడు గంగనమోని శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి సీఐ సత్యనారాయణ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును విచారణలో భాగంగా జడ్జి సాక్ష్యాధారాలు పరిశీలించి రాజమల్లుకు పదేళ్లు జైలు, రూ.20వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment