తెలంగాణ కళాకారులతో దొడ్డి కొమురయ్య సినిమా
హుజూర్‌నగర్: తెలంగాణలోని అన్ని జిల్లాల కళాకారులతో దొడ్డి కొమురయ్య జీవిత చర్రితపై సినిమా నిర్మిస్తున్నట్లు సినీ దర్శకుడు సేనాపతి అన్నారు. సోమవారం హుజూర్‌నగర్ వచ్చిన ఆయన స్థానిక కళాకారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గొప్ప చరిత్ర కలిగిన దొడ్డి కొమరయ్య జీవితాన్ని తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా నేటి తరం యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ కళాకారులకు ఈ సినిమాలో అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో కళాకారులు ఎస్. శ్రీనివాస్, జి. దీప, కె. బాబు, డి. శ్రీనివాస్, నరసింహచారి, బి. గోవిందరావు, కె. రవి, పి. వెంకటేశ్వర్లు, ఎం. సైదులు, డి. బాబురావు తదితరులు పాల్గొన్నారు.
గంజాయి తరలిస్తున్న
ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
సూర్యాపేటటౌన్: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను సూర్యాపేట టౌన్ సీఐ వీరరాఘవులు విలేకరులకు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సూర్యాపేట టౌన్ ఎస్‌ఐ సైదులు, పోలీస్ సిబ్బంది కలిసి సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో సూర్యాపేట పట్టణానికి చెందిన దాసరి సిద్దార్ధ, మహ్మద్ ఉమర్ బైక్‌పై ఒక కిలో 200 గ్రాముల గంజాయితో కోదాడ నుంచి సూర్యాపేటకు వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
పార్ట్‌టైం జాబ్ పేరుతో మోసం
● డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు
భువనగిరి: పార్ట్‌టైం జాబ్ పేరుతో ఓ వ్యక్తి వద్ద సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేశారు. భువనగిరి రూరల్ ఎస్‌హెచ్‌ఓ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన గోసాల శ్యామల్‌రావు ఏడాది క్రితం బతుకుదెరువు కోసం భువనగిరి మండలం రాయగిరి గ్రామానికి వలస వచ్చాడు. ప్రస్తుతం సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 15న పార్ట్‌టైం జాబ్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తూ ఒక లింక్ ఓపెన్ చేశాడు. అందులో తన వివరాలను నమోదు చేశాడు. తర్వాత తన ఫోన్‌లోని వాట్సాప్‌కు వచ్చిన వీడియోను చూసి లైక్ చేసి షేర్ చేశాడు. అనంతరం ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాందించవచ్చని చెప్పి కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. టాస్క్‌లో భాగంగా వారు పంపిన వెబ్‌సైట్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే 30శాతం లాభం వస్తుందని చెప్పారు. దీంతో శ్యామల్‌రావు మొదట రూ.1000 డిపాజిట్ చేయగా.. రూ.1500 రిటర్న్స్ వచ్చాయి. ఈవిధంగా ఈ నెల 18వ తేదీ నాటికి రూ.1,92,000 డిపాజిట్ చేశాడు. తర్వాత డబ్బులు రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి 1930 కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
తెలంగాణ కళాకారులతో దొడ్డి కొమురయ్య సినిమా
Comments
Please login to add a commentAdd a comment