లక్ష్యం సాధించే వరకు విశ్రమించొద్దు
కోదాడ: లక్ష్యాన్ని నిర్ధేశించుకొని.. దానిని సాధించే వరకు విశ్రమించొద్దని గ్రూప్–2 స్టేట్ టాపర్ నారు హరవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్–2లో తొలి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన కోదాడకు చెందిన హరవర్ధన్‌రెడ్డి విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే..
అక్కడ పుట్టి.. ఇక్కడ పెరిగా
మా స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కంభం. మా నాన్న నారు రవణారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడిగా ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహించేవారు. ప్రాథమిక విద్య ఖమ్మంలో, ఇంటర్మీడియట్ విజయవాడలో చదివాను. తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్(సీఎస్‌సీ) పూర్తిచేశాను. ప్రస్తుతం మా నాన్న కోదాడ కేఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు.
మా నాన్నే నాకు స్ఫూర్తి..
మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మా నాన్న కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఎన్‌ఐటీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు కూడా ప్రయత్నించలేదు.
తొలి ప్రయత్నంలోనే విజయం
2021 నుంచి గ్రూప్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టాను. ముందు సివిల్స్ కోసం ఆన్‌లైన్ కోచింగ్ తీసుకున్నాను. ఆ సమయంలోనే గ్రూప్–1, గ్రూప్ – 2 నోటిఫికేషన్లు రావడంతో సివిల్స్ వదిలేసి గ్రూప్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టాను. మొదట ఈ రెండింటికి ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పటికీ ఆ తర్వాత కేవలం గ్రూప్–2 పైనే పూర్తిగా దృష్టి సారించాను. రోజుకు 10 గంటలు చదివి తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచాను.
సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నా
పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం ఒక యుద్ధంలాంటిది. యుద్దంలో ఆయుధాలు ఎంత ముఖ్యమో పోటీ పరీక్షలకు ప్రమాణిక పుస్తకాలు అంత ముఖ్యం. దీంతో పాటు సొంతంగా నోట్స్ తయారు చేసుకోవడం కూడా చాలా అవసరం. ఇండియన్ హిస్టరీ కోసం నిధి సింఘానియా పుస్తకం, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వి. ప్రశాశ్ పుస్తకం, సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదివాను. కరెంట్ అఫైర్స్ కోసం కాంపిటీటివ్ వెబ్‌సైట్స్‌తో పాటు దినపత్రికలను చదివాను.
ఓపిక ఉంటేనే విజయం సొంతం
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఓపిక ఉండాలి. పరీక్షలు సుదీర్ఘకాలం సాగవచ్చు లేదా వాయిదా పడవచ్చు. ఇలాంటి సమయంలో సమన్వయం కోల్పోవద్దు. ఆశాజనకంగా ప్రయత్నించాలి. ఒకేసారి ఎక్కువ పరీక్షలకు సిద్ధమవ్వకుండా ఒకే పరీక్షపై దృష్టి పెట్టాలి. దానిని సాధించిన తర్వాత ఇతర పరీక్షల వైపు వెళ్లవచ్చు.
గ్రూప్–1, సివిల్స్‌కు సన్నద్ధమవుతా..
ప్రస్తుత మార్కులతో డిప్యూటీ తహసీల్దార్ లేదా రాష్ట్ర సచివాలయంలో ఏఎస్‌ఓ ఉద్యోగాన్ని ఎంచుకుంటాను. దీనిలో శక్తి వంచన లేకుండా సేవలందిస్తాను. భవిష్యత్తులో గ్రూప్–1, సివిల్స్ కోసం ప్రిపరేషన్ కొనసాగిస్తాను.
పోటీ పరీక్షలకు ఓపికతో
సన్నద్ధమవ్వాలి
గ్రూప్–2 స్టేట్ టాపర్ హరవర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment