
మూసీకి పూడిక ముప్పు
0.74 టీఎంసీల నీటి
నిల్వ సామర్థ్యం తగ్గుదల
కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) గతేడాది హైడ్రోగ్రాఫిక్, రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును గుర్తించింది. దేశ వ్యాప్తంగా 87 జలాశయాలు పూడిక కారణంగా వేగంగా నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయని సీడబ్ల్యూసీ పేర్కున్న సర్వేలో మూసీ జలాశయం ఉంది. మూసీ జలాశయంలో ఇప్పటికే 15.32 శాతం మేర పూడిక ఉందని, పరిరక్షణ చర్యలు తప్పవని ఈ సర్వే సూచించింది. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి 2024 వరకు 0.74 టీఎంసీల సామర్థ్యం తగ్గిపోయింది. ఫలితంగా నీటినిల్వ సామర్థ్యం 3.72 టీఎంసీలకు, ఆయకట్టు 33 వేల ఎకరాలకు పడిపోయిందని సీడబ్ల్యూసీ సర్వే పేర్కుంది. ప్రాజెక్టులో పూడిక తొలగించి పూర్తిస్థాయిలో నీటి నిల్వకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మూసీ ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
కేతేపల్లి : ఉమ్మడి జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తోంది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) గతేడాది నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును గుర్తించింది. ప్రాజెక్టు నిర్మించిన తొలినాళ్లలో నాలుగు నియోజకవర్గాల్లోని 42 వేల ఎకరాలకు పైగా సాగునీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీరు అందించారు. పూడిక పేరుకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నేడు 30 వేల ఎకరాలకు కూడా సాగు నీటిని అందించలేని దుస్థితికు చేరుకుంది.
1987లో స్కవర్ గేట్ల మూసివేత..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది హైదరాబాద్, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా 240 కిలోమీటర్లు ప్రవహిస్తూ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మూసీనదిపై సూర్యాపేట మండలం సోలిపేట వద్ద రెండు గుట్టల మద్యన రూ.2.20 కోట్ల వ్యయంతో 30 గేట్లతో 1963లో ప్రాజెక్టు నిర్మించారు. 645 అడుగులు(4.83 టీఎంసీలు) నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చే వరదనీటితో చెత్తచెదారం, మట్టిని ఎప్పటికప్పుడు బైటకు విడుదల చేసేందుకు అప్పటి ఇంజనీర్లు ప్రాజెక్టు అడుగు భాగాన 10 స్కవర్‌గేట్లు, మధ్యలో 8 రెగ్యులేటర్ గేట్లు, పైభాగంలో 12 క్రస్ట్‌గేట్లతో ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టుకు అడుగు భాగంలో ఉండే స్కవర్‌గేట్లు తరుచుగా మరమ్మతులకు గురవుతుండటంతో 1987లో కాంక్రీట్ వేసి వాటిని శాశ్వతంగా మూసివేశారు. దీంతో ప్రాజెక్టులో పేరుకపోయిన పూడికను వరదనీటితో పాటు బైటకు పంపించేందుకు ఉన్న ఏకై క మార్గం మూసుకుపోయింది.
వరద నీటితో పూడిక చేరిక..
మూసీ నదికి వరదలు వచ్చినపుడు ఉప నదులు, వాగులు, వంకల ప్రవాహాలతో ఇసుక, ఒండ్రుమట్టి జలాశయంలో చేరుతున్నాయి. వరదలు అధికంగా వచ్చే సమయంలో నీటి ఉధృతితో తీరాలు కోతకు గురై చెట్లు, మట్టి కొట్టుకొచ్చి ఏటా జలాశయంలో చేరడం కూడా పూడికకు కారణమవుతోంది.
ఫ తగ్గుతున్న నీటి నిల్వ సామర్థ్యం
ఫ కేంద్ర జల సంఘం సర్వేలో వెల్లడి