
గోడ కూలి భవన నిర్మాణ కార్మికురాలి మృతి
చౌటుప్పల్ రూరల్: నిర్మాణంలో ఉన్న గోడ కూలి భవన నిర్మాణ కార్మికురాలు మృతి చెందింది. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం మన్నేవారిపంపు గ్రామానికి చెందిన మల్లేమోని భిక్షపతి, అతడి భార్య సుగుణమ్మ(50) 20 సంవత్సరాల క్రితం చౌటుప్పల్‌కు వలస వచ్చి, తంగడపల్లి రోడ్డులో సొంతంగా ఇల్లు నిర్మించుకుని, కూలీ పనులు చేసుకుంటూ జీవవనం సాగిస్తున్నారు. సుగుణమ్మ భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోంది. మంగళవారం ఉదయం పంతంగి గ్రామానికి చెందిన భవన నిర్మాణ గుత్తేదారు బోయ నర్సింహ ఎస్.లింగోటం గ్రామంలో ఉప్పు వెంకటేష్ ఇంటి నిర్మాణం చేయడానికి సుగుణమ్మను కూలీకి తీసుకెళ్లాడు. ఉదయం 11 గంటల సమయంలో మొదటి అంతస్తు పైకి సుగుణమ్మ ఇసుక మోస్తుండగా.. పరంజా కూలిపోవడంతో ఒక్కసారిగా ఆమె కింద ఉన్న పిల్లర్‌పై పడిపోయింది. అదే సమయంలో నిర్మాణంలో ఉన్న గోడ ఆమె మీద కూలింది. దీంతో సుగుణమ్మ తలకు తీవ్ర గాయాలు కాగా చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటి యాజమాని వెంకటేష్, గుత్తేదారు బోయ నర్సింహ పనిచేసే చోట సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతోనే తన తల్లి కిందపడి మృతి చెందినట్లు మృతురాలి కుమారుడు మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.