ఆస్తి కోసం ఘాతుకం | - | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం ఘాతుకం

Published Sat, Apr 12 2025 2:14 AM | Last Updated on Sat, Apr 12 2025 2:14 AM

ఆస్తి

ఆస్తి కోసం ఘాతుకం

సవతి కూతురును హత్యచేసిన మహిళ

శాలిగౌరారం: ఆస్తి కోసం సవతి కూతురును హత్య చేసి మృతదేహాన్ని మూసీనదిలో పూడ్చిపెట్టగా పోలీసులు హత్య కేసును ఛేదించి ఆ మహిళతో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరిని అరెస్టు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామం పడమటితండా(డి)కి చెందిన జాటోతు పీనానాయక్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య శాంతి, రెండవ భార్య లలిత. మొదటి భార్యకు కొడుకు, కూతురు మహేశ్వరి(23) ఉండగా రెండవ భార్య లలితకు కుమార్తె(14) ఉన్నారు. మొదటి భార్య శాంతి అనారోగ్యం బారినపడడంతో 16 సంవత్సరాల క్రితం ఆమెకు పీనానాయక్‌ రూ.4 లక్షలు నగదు, పోషణ కోసం నెలకు రూ.4 వేలు ఇవ్వడంతో పాటు కుమార్తె మహేశ్వరిని తన వద్ద ఉంచుకొని చదివిపించి వివాహం చేసేవిధంగా పెద్దల సమక్షంలో ఒప్పదం చేసుకుని శాంతికి దూరంగా ఉంటున్నాడు. దీంతో శాంతి తన కుమారుడితో కలిసి దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలోని తన పుట్టినింటికి వచ్చి అక్కడే ఉంటోంది. శాంతి నుంచి విడిపోయిన సంవత్సరం తర్వాత పీనానాయక్‌ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. ఆయన తన కుమార్తె మహేశ్వరి, రెండవ భార్య లలితతో కలిసి ఉంటున్నాడు. ప్రస్తుతం లలితకు కుమార్తె(14) ఉంది. ప్రస్తుతం పీనానాయక్‌ రెండవ భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి మేడ్చల్‌ జిల్లా మేడిపల్లిలో నివాసం ఉంటున్నాడు. పీనానాయక్‌కు స్వగ్రామంలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమితో పాటూ హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ లక్ష్మీనగర్‌ కాలనీలో రెండు సొంత ఇళ్లు ఉన్నాయి. తండ్రి, పినతల్లి వద్ద ఉంటూ మహేశ్వరి(23) బీఎస్సీ నర్సింగ్‌ విద్య పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కాంట్రాక్టు పద్ధతిలో స్టాప్‌నర్స్‌గా పనిచేస్తుంది. మహేశ్వరికి వివాహం చేసేందుకు తండ్రి పీనానాయక్‌ పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలో శంషాబాద్‌కు చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న బంధువైన ఓ అబ్బాయికి మహేశ్వరిని ఇచ్చి వివాహం చేసుకునేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో 2024 అక్టోబర్‌లో రూ.కోటి కట్నం ఇచ్చేవిధంగా ఒప్పందంతో నిశ్చితార్ధం చేసుకున్నారు. మహేశ్వరికి కట్నం కింద బోడుప్పల్‌ లక్ష్మీనగర్‌లోని ఒక ఇల్లుతో పాటు బంగారం, కొంత నగదు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

డిసెంబర్‌ 7న ఇంట్లో హత్య చేసి...

మహేశ్వరిని చంపాలనే పథకంలో భాగంగా 2024 డిసెంబర్‌ 7న ఇంట్లో పాయసంలో నిద్రమాత్రలు వేసి మహేశ్వరికి ఇచ్చారు. ఆ పాయసం తాగిన మహేశ్వరి స్పృహతప్పి పడిపోవడంతో లలిత, రవిలు కలిసి మహేశ్వరిని గొంతునులిమి చంపాశారు. అనంతరం మహేశ్వరి మృతదేహాన్ని గోనేసంచిలో మూటకట్టి మరో వ్యక్తి సహాయంతో అదేరోజు రాత్రి రవి కారులో మృతదేహాన్ని తీసుకువచ్చి నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వంగమర్తి వద్ద మూసీనదిలో బ్రిడ్జి పిల్లర్‌ నెంబర్‌ 1 సమీపంలో ఇసుకలో గుంతతీసి పూడ్చిపెట్టారు. రాత్రి ఇంటికి వచ్చిన పీనానాయక్‌.. కుమార్తె మహేశ్వరి ఇంటికి రాకపోవడంతో ఎటు పోయిందని భార్య లలితను అడగగా డ్యూటీకని చెప్పి ఇంట్లో ఫోన్‌వదిలి వెళ్లిపోయిందని, తాను ప్రేమించిన వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకుంటానని ఫోన్‌చేసి చెప్పిందని వివరించింది. దీంతో భార్య చెప్పిన విషయాన్ని నమ్మిన మహేశ్వరి తండ్రి పీనానాయక్‌ కుమార్తెకు వివాహ నిశ్చితార్ధం కావడంతో ప్రేమ విషయాన్ని బయటకు పొక్కుండా రహస్యంగా ఉంచి కుమార్తె కోసం వెతకడం ప్రారంభించాడు. మహేశ్వరిని వివాహం చేసుకునే అబ్బాయి మహేశ్వరి ఫోన్‌ ఎత్తడం లేదని, మెసేజ్‌లకు స్పదించడంలేదని మామ పీనానాయక్‌కు చెప్పడంతో అదోఇదో చెబుతూ నెట్టుకొస్తున్నాడు. ఈక్రమంలో ఆ అబ్బాయి ఒత్తిడి చేస్తుండటంతో వారం రోజుల క్రితం పీనానాయక్‌ తన కుమార్తె అదృశ్యంపై మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని కుటుంబ సభ్యుల ఫోన్‌కాల్‌ డేటా, లొకేషన్‌ ఆధారంగా పీనానాయక్‌ రెండవ భార్య లలితను, ఆమె ప్రియుడు రవిని విచారించారు. దీంతో మహేశ్వరి హత్య, మృతదేహం పూడ్చివేత విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మేడిపల్లి పోలీసులు, శాలిగౌరారం పోలీసుల సహాయంతో శుక్రవారం ఉదయం నేరస్తులను పట్టుకొచ్చి పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని గుర్తించారు. ఇసుకలో పూడ్చిపెట్టిన మహేశ్వరి మృతదేహాన్ని వెలికి తీసి స్థానిక తహశీల్దార్‌ యాదగిరి సమక్షంలో పంచనామా జరిపి హైదరాబాద్‌కు చెందిన వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. మహేశ్వరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మృతదేహాన్ని మూసీనది ఇసుకలో

పాతిపెట్టిన నిందితులు

మృతురాలి తండ్రి ఫిర్యాదుతో

పోలీసుల దర్యాప్తు

ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా కేసును

ఛేదించిన మేడిపల్లి పోలీసులు

ఆస్తి పోతుందనే కక్షతో...

తనవద్ద ఉంటున్న సవతి కుమార్తె మహేశ్వరి పెళ్లికి కోటి రూపాయల కట్నం ఇస్తుండటం, కట్నం కింద ఇల్లు, బంగారం, నగదు ఇవ్వడం లలితకు నచ్చలేదు. దీంతో మహేశ్వరిపై లలిత కక్ష పెంచుకుంది. మహేశ్వరిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో పీనానాయక్‌ పేరున బ్యాంకులో ఉన్న రూ.20 లక్షల నగదును భర్తపై ఒత్తిడి తెచ్చి తన ఖాతాలోకి మార్చుకుంది. ఇక ఇల్లు, బంగారం దక్కాలంటే మహేశ్వరిని భూమి మీదలేకుండా చేయాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో లలిత తన స్వగ్రామమైన వెలిశాలకు చెందిన తన మేనమామ కుమారుడు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అయిన రవితో వివాహేతర సంబంధం పెట్టకొని.. మహేశ్వరిని చంపితే ఆస్తి మొత్తం తనకు, తన కుమార్తెకే దక్కుతుందని, ఎలాగైనా మహేశ్వరిని చంపాలని రవితో కలిసి పథకం రచించింది.

ఆస్తి కోసం ఘాతుకం1
1/2

ఆస్తి కోసం ఘాతుకం

ఆస్తి కోసం ఘాతుకం2
2/2

ఆస్తి కోసం ఘాతుకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement