
కాళ్ల పారాణి ఆరకముందే వివాహిత ఆత్మహత్య
చౌటుప్పల్: పైళ్లెన 27 రోజులకే ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పద్మశాలికాలనీలో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భువనగిరి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన గాయత్రి అలియాస్ లావణ్య(19)కు చౌటుప్పల్‌కు చెందిన జెల్ల సంతోష్‌తో మార్చి 16న వివాహం జరిగింది. సంతోష్ స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగానే ఆదివారం ఉదయం సంతోష్ డ్యూటీకి వెళ్లాడు. సంతోష్ తల్లిదండ్రులు వివాహానికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న గాయత్రి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహానికి వెళ్లిన అత్తమామలు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి గాయత్రి విగతజీవిగా కనిపించింది. గాయత్రి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలికి తల్లిదండ్రులు లేరని సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.