
భూ భారతికి శ్రీకారం
భూ సమస్యలు ఇక చకచకా పరిష్కారం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఽభూమిపై హక్కుల విషయంలో రైతులకు ఎదురయ్యే సమస్యలు ఇక క్షేత్ర స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతిని తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌ను డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్‌డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్లు హజరయ్యారు.
ధరణి స్థానంలో ఇకపై భూ భారతి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో రెవెన్యూ చట్టాన్ని తెచ్చి, ఆ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ధరణిని ప్రారంభించింది. దాంతో రైతులకు ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా.. కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ధరణిలో అన్ని ఆప్షన్లు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌ఓఆర్) చట్టం చేసింది. అయితే దానిని వెంటనే అమలు చేయలేదు. ధరణిలో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? అనే అంశాలను ముందుగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. అక్కడ గుర్తించిన సమస్యల ఆధారంగా.. వాటి పరిష్కారాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్‌ఓఆర్ చట్టం–2025 అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగానే భూ భారతి పోర్టల్‌ను ప్రారంభించింది. మొదట రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా భూభారతిని అమలు చేయనుంది. ఆ తరువాత జూన్ నుంచి అన్ని మండలాల్లో అమలు చేయనుంది. అంతకంటే ముందుగా జిల్లాలో ప్రతి రోజు రెండు మండలాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సమావేశాలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరుకానున్నారు. ఈ చట్టంలో క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకు, ఆర్డీఓలకు కూడా అధికారాలు లభించనున్నాయి.
ఫ భూ భారతి పోర్టల్‌ను
లాంచనంగా ప్రారంభించిన సీఎం
ఫ జూన్ నుంచి అన్ని ప్రాంతాల్లో
పూర్తిస్థాయిలో అమలు
ఫ మళ్లీ తహసీల్దార్, ఆర్డీఓలకు అధికారాలు
ఫ భూ భారతి ప్రారంభంలో జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్, అధికారులు

భూ భారతికి శ్రీకారం