శ్రీశైలం వస్తున్నారా.? మా సత్రం ఆతిథ్యం స్వీకరించండి | Sakshi
Sakshi News home page

శ్రీశైలం వస్తున్నారా.? మా సత్రం ఆతిథ్యం స్వీకరించండి

Published Sun, Apr 23 2023 2:34 AM

నిర్మాణం పూర్తికావస్తున్న గౌరి (గవర)నిత్యాన్నదాన సత్రం  - Sakshi

శ్రీశైలం: మల్లన్న సన్నిధి శ్రీశైలంలో సత్రాలు విస్తరిస్తున్నాయి. ఏడు దశాబ్దాల క్రితం రెండు సత్రాలతో మొదలై నేడు వంద ఎకరాల విస్తీర్ణంలో వందకుపైగా వెలిశాయి. వీటిలో కొన్ని సకల సౌకర్యాలు కలిగి భక్తులకు అవసరమైన సేవలు అందిస్తున్నాయి. మరికొన్ని అన్నపూర్ణ నిలయాలుగా వర్ధిల్లుతున్నాయి.

కులానికో సత్రం..

తొలుత 1955కు పూర్వం ఆర్యవైశ్యులు శ్రీశైలానికి వచ్చే భక్తుల కోసం శ్రీ వాసవీ అఖిలభారత ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, శ్రీ వీరశైవ లింగాయితీసత్రం ఏర్పడ్డాయి. ఆ కాలంలో రోడ్డుమార్గం లేకపోవడంతో అటవీమార్గం ద్వారా శివరాత్రి, ఉగాది పర్వదినాలకు భక్తులు శ్రీశైలం చేరుకునేవారు.

1957లో రోడ్డుమార్గం ఏర్పడిన తర్వాత అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ నీలం సంజీవరెడ్డి శ్రీశైలం వచ్చి మల్లన్నను దర్శించుకున్నారు. ఆ సమయంలో వాసవీసత్రాన్ని నిర్వహిస్తున్న మూర్తి వెంకటేశ్వర్లు, లింగాయితీ సత్రం ఫౌండర్‌ ప్రెసిడెంట్‌, అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్‌ బోగిశెట్టి జోగప్ప సత్ర నిర్మాణాలకు ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించారు.

ఈ రెండు కుల సత్రాలతో పాటు అప్పటికే శ్రీశైల జగద్గురు వాగీశ పండితారాధ్య పీఠంకు సంబంధించిన స్థలం ఆలయ ప్రాంగణంలో ఉండేది. ప్రస్తుతం వీరశైవ లింగాయితులకు సంబంధించిన మూడు సత్రాలు, ఆర్యవైశ్యులకు చెందిన సత్రాలు మూడు ఉన్నాయి.

అనంతరం కాలంలో కరివేన బ్రాహ్మణ సత్రం, రెడ్డి, కమ్మ, కాపు, గౌడ, క్షత్రియ, వెలమ, యాదవ, నాయీబ్రాహ్మణ, రజక, కరికాల, గాండ్ల, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, వీరశైవ శరణ బసవేశ్వర, దేవాంగ, కుమ్మరి, వాల్మీకి (బోయ), ఉప్పర, ముదిరాజ్‌, తదితర ఎన్నో కులాల సత్రాలు శ్రీశైలంలో ఏర్పడ్డాయి.

ప్రముఖ సత్రాలకు కోట్లకొద్ది డిపాజిట్లు ఉన్నాయి. వీటి ద్వారా నిర్వహణ కొనసాగిస్తున్నారు. పలు సత్రాల్లో 100కు పైగా గదులు, సూట్లు, ప్రత్యేక కాటేజీలు సైతం ఉన్నాయి. కాగా శ్రీశైల దేవస్థానం ఆయా సత్రాలకు కనిష్టంగా 50 సెంట్లు, గరిష్టంగా 4 నుంచి 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ద్వారా కేటాయించింది.

దాతల సహకారంతో....

ఏ సత్రమైనా అభివృద్ధి చెందాలంటే దాతల సహకారం ఎంతో అవసరం. దేవస్థానం కూడా గదుల నిర్మాణం, అన్నదానం తదితర వాటికి దాతల సహకారం తీసుకుంటుంది. అయితే, లక్షల్లో విరాళాలు ఇచ్చిన దాతలకు వసతి, దర్శన సౌకర్యాల విషయంలో వెసులుబాటు కల్పిస్తుంది.

అదే సత్రాల నిర్వాహకులు రూ. 2 లక్షలు ఆపై విరాళం ఇచ్చిన దాతల పేరుపై గది కేటాయింపు చేస్తారు. ఏడాదిలో 30 నుంచి 60 రోజుల పాటు సదరు దాత ఉచితంగా వసతి కల్పిస్తారు. అన్నదానంలో పాలు పంచుకోవాలంటే రూ.216, రూ.516 కనిష్టంగా చెల్లించాలి. దాతల గోత్రనామాలతో అన్నదానం చేస్తారు.

శాశ్వత పద్ధతిపై ఏడాదిలో ఒక్కరోజు అన్నదానానికి రూ. 1,116 నుంచి ఆపై విరాళాలు ఇవ్వవచ్చు.

నిర్మాణం పూర్తయ్యే దశలో శ్రీగురుసదన్‌ వసతిభవన్‌
1/1

నిర్మాణం పూర్తయ్యే దశలో శ్రీగురుసదన్‌ వసతిభవన్‌

Advertisement
Advertisement