18 ఏళ్లు నిండాయా? ఓటుకు దరఖాస్తు చేసుకోండి
దరఖాస్తుకు ఏప్రిల్ 15 చివరి తేదీ
ఈ ఎన్నికల్లోనే ఓటు వేయవచ్చు
ప్రజాస్వామ్యం కోసం ముందుకు రండి
సాక్షి, నంద్యాల: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మరో 50 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసి మీకు ఇష్టమైన నేతను ఎన్నుకోవచ్చు. ఎన్నికల రోజు ఓటు వేయాలి అంటే ముందుగా మీరు ఓటరుగా నమోదు చేసుకుని ఉండాలి. ఓటరుగా నమోదు చేసుకుని ఉన్నా తుది ఓటరు జాబితాలో మీ పేరు లేకుంటే ఓటు వేసేందుకు అనర్హులు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ఎన్నికల సంఘం చివరి అవకాశం కల్పించింది. తుది ఓటరు జాబితాలో పేరు లేని వారు.. ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అర్హులైన వారు ఏప్రిల్ 15వ తేదీలోపు ఓటరుగా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, అన్ని వివరాలు సక్రమంగా ఉంటే తుది ఓటరు జాబితాలో పేరును చేరుస్తారు.
ఆన్‌లైన్‌లో...
ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌వీఎస్‌పీ.ఇన్ వెబ్‌సైట్‌లో మీ ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ‘రిజిస్టర్ యూజ్ ఏ న్యూ ఓటర్’ పై క్లిక్ చేస్తే ఫాం–6 దరఖాస్తు వస్తుంది. అక్కడే దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని పూర్తి చేయాలి. తర్వాత మీ ఫోన్ నంబర్‌కు రెఫరెన్స్ ఐడీ నంబర్ వస్తుంది. దాని ఆధారంగా అదే వెబ్‌సైట్‌లో అప్లికేషన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులోని వివరాల ఆధారంగా బూత్ స్థాయి అధికారి మీ అడ్రస్‌కు వచ్చి మీ వివరాలను పరిశీలించి, నిర్ధారించుకున్న తర్వాత ఓటరు జాబితాలో మీ పేరు చేరుస్తారు. అలాగే హెచ్‌టీటీపీఎస్//ఓటర్ పోర్టల్.ఈసీఐ.జీఓవీ.ఇన్ వైబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయ్యాక వెబ్‌సైట్‌లో న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్‌లోకి వెళ్లి వివరాలు పొందుపరిస్తే నిర్ధారించుకున్నాక మీ పేరు ఓటరు జాబితాలో చేరుస్తారు. మొబైల్‌లో ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment