
శ్రీశైలం జలాశయంలోకి నీటి మళ్లింపు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాం దిగువ భాగంలో ఉన్న 5,209 క్యూసెక్కుల నీటిని మంగళవారం నుంచి బుధవారం వరకు జలాశయంలోకి మళ్లించారు. ఇందుకు ఎడమగట్టు కేంద్రంలో పంప్‌మోడ్ ఆపరేషన్ నిర్వహించారు. బుధవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 84.2894 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 851.90 అడుగులకు చేరుకుంది.
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
నంద్యాల (న్యూటౌన్): జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను డీఆర్‌ఓ రాము నాయక్ ఆదేశించారు. బుధవారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు ఉదయం 9–30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 25,542 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరువుతున్నారన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని 130 పరీక్ష కేంద్రాలకు 130 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 130 మంది శాఖాధికారులు, 5 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమిస్తామన్నారు.
శ్రీశైలంలో పనుల నాణ్యతపై విజి‘లెన్స్’
శ్రీశైలం టెంపుల్: కర్నూలు విజిలెన్స్ అధికారి డీఈ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు అధికారులు బుధవారం శ్రీశైలంలోని పనులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలు రెండు రోజుల పాటు చేయనున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. గణేశ్ సదన్ ప్రహరీ చుట్టూ ఉన్న సీసీ రోడ్డు, నక్షత్రవనం, అటవీ సరిహద్దు రిటర్నింగ్ వాల్ పనుల్లో అవకతవకలు జరిగినట్లు కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో శ్రీశైలం చేరుకుని పనుల నాణ్యతను అధికారులు తనిఖీ చేశారు. ఆయా పనులకు చెల్లించిన బిల్లులు కూడా పరిశీలించారు.
పొదుపు మహిళలకు వ్యాపార అవకాశాలు
ఆళ్లగడ్డ: పొదుపు సంఘాల్లోని మహిళలు వ్యాపారంగా ఎదగడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో పొదుపు మహిళలకు వివిధ చేతివృత్తులు, వ్యాపార నిర్వహణపై స్కిల్ డెలవప్‌మెంట్ ఆధ్వర్యంలో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్‌డీఏ పీడీ మాట్లాడుతూ.. పొదుపు సంఘ మహిళలు రుణ పరిమితిని పెంచుకోవాలన్నారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఎల్‌డీఎం రవీంద్రబాబు, స్కిల్ డెవలప్‌మెంట్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, ఐపీఎ ప్రసాద్, ఏసీ విజయగోపాల్ పాల్గొన్నారు.
20న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): ఈ నెల 20వ తేదీన ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి నోటు ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలను స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని మినీ సమావేశ భవనంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి – శిశు సంక్షేమం, పను లు – ఆర్థిక ప్రణాళిక తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన అధి కారులు, జెడ్పీటీసీ సభ్యులు తమకు కేటాయించిన సమయానికి ఆయా స్థాయీ సంఘ సమావేశాలకు హాజరు కావాలని సీఈఓ కోరారు.

శ్రీశైలం జలాశయంలోకి నీటి మళ్లింపు

శ్రీశైలం జలాశయంలోకి నీటి మళ్లింపు
Comments
Please login to add a commentAdd a comment