
రేషన్ మాఫియాపై ఉక్కుపాదం
బొమ్మలసత్రం: రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశభవనంలో ఆయన నంద్యాల సబ్‌డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా స్టేషన్లలో నమోదైన కేసుల స్థితిగతులు, అరెస్ట్, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల ఫైళ్లను పరిశీలించారు. జిల్లాలో రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. నేరం చేసిన నిందితులకు శిక్షపడేలా సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నారు. తప్పిపోయిన మహిళలు, బాల బాలికల కేసులను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోక్సో కేసుల్లో నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. రహదారులపై ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్‌లను గుర్తించి సూచికలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. చోరీలు, దారి దోపిడీల నియంత్రణ కోసం పోలీస్ బీట్ పెంచాలని సూచించారు. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని గంజాయి, అక్రమ మద్యం రవాణ, గుట్కా తదితర వాటిపై దృష్టిఉంచాలని వివరించారు. నేరాలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. డీఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్ , అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్‌బాబు, సబ్ డివిజన్ సీఐలు పాల్గొన్నారు.
ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా
Comments
Please login to add a commentAdd a comment