ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో అగ్నిప్రమాదం
కర్నూలు(హాస్పిటల్): వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం పక్కనున్న ప్రాంతీయ శిక్షణా కేంద్రం(మేల్) ఆవరణలో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం మధ్యాహ్న భోజనం వేళ కార్యాలయ ఆవరణలో నిలిపి ఉన్న పాతవాహనాల వద్ద మంటలు చెలరేగాయి. ప్రమాదంలో స్క్రాబ్‌లో ఉంచిన(కాలపరిమితి ముగిసిన) మూడు జీపులు, ఒక అంబులెన్స్ కాలిపోయాయి. ఈ వాహనాలను 2018లో జిల్లా ఇమ్యునైజేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు అక్కడ ఉన్న పాత వాహనాలను ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఆవరణకు తరలించారు. మధ్యాహ్నం వేళలో ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఎవరైనా మూత్రవిసర్జనకు వెళ్లి సిగరెట్ ముక్కను ఆర్పకుండా పారవేయడంతో ప్రమాదం జరిగి ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు.
హంద్రీనీవా కాలువలో బాలుడి గల్లంతు
పత్తికొండ రూరల్: మండల పరిధిలోని హంద్రీనీవా కాలువలో గురువారం 12 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. డోన్‌కు చెందిన దామోదర్‌గౌడు, రాజేశ్వరి దంపతులు కుమారుడు తులసీగౌడ్‌తో కలిసి గత శుక్రవారం గ్రామంలో జరిగిన ఆలయాల ప్రారంభోత్సవానికి వచ్చారు. గురువారం ఉదయం గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లిన తులసీగౌడ్ కాళ్లు శుభ్రం చేసుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని అధికారులకు విషయం చేరవేశారు. ఫైర్ స్టేషన్ ఎస్‌ఐ దినకర్‌బాబు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సాయంత్రమైనా ఆచూకీ లభించలేదు. సీఐ జయన్న గ్రామస్తులతో విచారణ చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరు దుర్మరణం
● మరొకరికి గాయాలు
పాణ్యం: మండల పరిధిలోని సుగాలిమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయాలపాలైనట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. పాణ్యం చెంచు కాలనీకి చెందిన తోట ఆంజనేయులు (26), సోదరుడు లక్ష్మన్న తమ్మరాజుపల్లె నుంచి బైక్‌పై పాణ్యం బయలుదేరారు. సుగాలిమెట్ట వద్ద ఎరువుల ట్రాక్టర్ రాంగ్ రూట్లో వస్తూ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మన్న తీవ్రగాయాలపాయ్యాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు. మృతుడికి భార్య చిందులు, ముగ్గురు కుమారులు ఉన్నారు. హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment