
అనుసరణీయులు సంజీవయ్య
నంద్యాల: పేదల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ దామోదరం సంజీవయ్య అనుసరణీయులని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ రాము నాయక్, దళిత సంఘాల నాయకుల పాల్గొన్న ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సంజీవయ్య దళిత కుటుంబంలో జన్మించి రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో రాణించి ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అమలుకు కృషి చేశారని కొనియాడారు. జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్టు, వరదరాజస్వామి గుడి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారన్నారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. నీతి, నిజాయితీ, స్వశక్తితో ఉన్నత పదవులను అధిరోహించి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత దళితుల హక్కుల కోసం పోరాడిన తొలి వ్యక్తి దామోదరం సంజీవయ్య అని కొనియాడారు. అంతకుముందు దళిత సంఘాల నాయకులు దళితుల సంక్షేమం కోసం సంజీవయ్య అందించిన సేవలను వివరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రవికాంత్ బాబు, కాసన్న, రమేష్ నాయక్, బాల నాగన్న, మురళీ, దళిత సంఘాల నాయకులు కొమ్ము పాలెం శ్రీనివాస్, సతీష్ కుమార్, దండు వీరయ్య, చిటికెల సలోమి, సఫాయి కర్మచార కమిటీ సభ్యులు చెన్నమ్మ, మహేశ్వరమ్మ, రవికుమార్ పాల్గొన్నారు.
దామోదరం సంజీవయ్య జయంతి
వేడుకల్లో కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment