
కళ్లను అశ్రద్ధ చేయొద్దు
● విద్యార్థులతో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల: విద్యార్థులు కళ్లను అశ్రద్ధ చేయరాదని, ఎక్కువగా సెల్‌ఫోన్లు చూడకూడదని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సూచించారు. శుక్రవారం నంద్యాల క్రాంతినగర్‌లోని ఏపీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులందరికీ ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించి లోపాలు ఉన్న విద్యార్థులకు ఉచితంగా అద్దాలు అందజేస్తుందన్నారు. అయితే, చిన్నవయస్సులోనే విద్యార్థుల చూపు మందగిస్తుండటం బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరూ కంటి చూపును పెంచుకోవడంపై దృష్టి సారించాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థులు కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండి ఏ విటమిన్ గల ఆహార పదార్థాలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, గుడ్లు, పాలు, పండ్లు, చేపలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఏపీ మోడల్ స్కూల్‌లో కంటి సమస్యలు ఉన్న 44 మంది విద్యార్థులకు కంటి అద్దాలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటపాటల్లో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డాక్టర్ మాధవీలత, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సిసీలియా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment