సుగాలి ప్రీతి కేసును నీరుగార్చే యత్నం
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదోతరగతి దళిత విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శశికళ మండిపడ్డారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సుగాలిప్రీతి హత్యకు గురైందన్నారు. దోషులను కాపాడేందుకు చంద్రబాబు ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఆయనకు లేదన్నారు. అందుకే సీబీఐ నుంచి తప్పించి విచారణను రాష్ట్ర ప్రభత్వం చేపట్టే విధంగా రఘరామరాజు అనే వ్యక్తి ద్వారా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయించారని ఆరోపించారు. వైఎస్ జగన్ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కుటుంబానికి రూ. 8 లక్షలు ఆర్థిక సహయం, 5 ఎకరాల భూమి, ఇంటి కోసం 5 సెంట్ల స్థలం ఇచ్చారన్నారు. అంతేకాకుండా కేసు దర్యాప్తు వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని సీబీఐకు అప్పగించారన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు కుయుక్తులకు పాల్పడుతుందన్నారు. హత్య జరిగిన రెండేళ్ల వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, 2017 సంవత్సరం ఆగస్టు నెలలో ఫోరెన్సిక్ వైద్యులు డాక్టర్ శంకర్ స్పష్టంగా పోస్టు మార్టం నివేదికలో బాలికపై అత్యాచారం, హత్య జరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారన్నారు. అప్పట్లో కట్టమంచి రామలింగారెడ్డి కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసు, పోక్స్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. అయితే, 23 రోజుల వ్యవధిలోనే వారు బెయిల్‌పై బయటకు వచ్చారన్నారు.
పాలన చేత కాక డైవర్షన్ పాలిటిక్స్
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తూ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని శశికళ విమర్శించారు. జగనన్న హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని చెప్పారు. చంద్రబాబు రూ.73 వేల కోట్లు అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్‌పాలనకు త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కూటమి నాయకులు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి అక్రమ సంపాదనే ధ్యేయంగా లిక్కర్, ఇసుక, పేకాట క్లబ్‌ల నిర్వహణలో బీజీగా ఉన్నారన్నారు. సమావేశంలో పార్టీ నాయకురాలు కల్లా నాగ వేణి రెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు మంగమ్మ, రాఽధికమ్మ తదితరులు పాల్గొన్నారు
బాధిత కుటుంబానికి న్యాయం
చేయాలన్న చిత్తశుద్ధి సర్కారుకు లేదు
యూటర్న్‌పై పవన్ కళ్యాణ్ స్పందించాలి
మహిళలకు భద్రత కల్పించడంలో
హోం మంత్రి విఫలం
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం
జిల్లా అధ్యక్షురాలు శశికళ
నాడు శిక్షిస్తానన్న పవన్ కళ్యాణ్ స్పందించాలి
సుగాలి ప్రీతి కేసులో దోషులను శిక్షించే వరకు వదిలేది లేదని, వారిని తొక్కిపెట్టి నారా తీస్తానని ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పుడు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బాధిత కుటుంబానికి న్యాయం చేయలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది నెలల కాలంలో 78 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. హోమంత్రి అనిత మహిళలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment