ఎగ్జిబిషన్ ఏర్పాటుకు బహిరంగ వేలం
మహానంది: మహానందిలోని టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో జెయింట్ వీల్, ఎగ్జిబిషన్ ఏర్పాటు కోసం మంగళవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో ఐదుగురు డిపాజిట్లు చెల్లించి పోటీ పడ్డారు. దేవస్థానం పాట రూ. 3.50 లక్షల నుంచి మొదలుకాగా గోపవరం గ్రామానికి చెందిన చంద్రుడు (చంద్ర) రూ. 5.15 లక్షలతో హెచ్చుపాటదారుడిగా నిలిచి దక్కించుకున్నారు. గత ఏడాది రూ. 3.50లక్షలు వచ్చిందని, ఈ ఏడాది అదనంగా రూ. 1.65 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈఓ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
శవమై తేలాడు
మద్దికెర: అదృశ్యమైన మద్దికెర గ్రామానికి చెందిన బోగోలు తిరుమలరెడ్డి (45) సోమవారం శవమై తేలాడు. వివరాల్లోకి వెళితే.. తిరుమలరెడ్డి పిల్లల చదువుకోసం గుంతకల్లులో నివాసం ఉంటున్నాడు. బుగ్గ సమీపంలోని వ్యవసాయతోటలో పనులతో పాటు సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టి వార్తలు సేకరిస్తూ జీవనం చేస్తున్నాడు. రోజు మాదిరిగానే తోటకు వస్తూ అదృశ్యమయ్యాడు. కాలువ వద్ద స్కూటర్, సెల్‌ఫోన్ పడి వుండడంతో పోలీసులు ఆచూకీ కోసం కాలువలో వెతికినా ఫలితం కనబడలేదు. అయితే మంగళవారం మధ్యాహ్నం శవమై తేలడంతో పోస్టుమార్టుం నిమిత్తం గుంతకల్లుకు తరలించారు.
ఉప కారాగారం ఆకస్మిక తనిఖీ
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఉపకారాగారాన్ని ఐదో అదనపు జిల్లా జడ్జి మురళీకృష్ణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కారాగారంలోని వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ముద్దాయిలకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. జైలులో ఏమైనా సమస్యలుంటే లీగల్ ఎయిడ్ క్లినిక్‌లోని న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. లేదంటే ఆన్‌లైన్ నెంబర్ 15100 కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ముఖ్యంగా సత్ప్రవర్తనతో మెలగాలని ఖైదీలకు సూచించారు. కార్యక్రమంలో జైలు ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ యోగేష్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment