భూమి కొనుగోలు అక్రమాలను వెలికితీస్తాం
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఆదోని మండలం చిన్న గోనేహాల్, చిన్న హరివాణం గ్రామాల్లో 2018– 2019లో భూమి లేని నిరుపేద దళితుల కోసం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన భూములపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్ అన్నారు. ఈ రెండు గ్రామాల్లో 76 మంది లబ్ధిదారులకు రూ.4.65 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన 76.52 ఎకరాల భూములను ఇప్పటి వరకు ఒక్క దళిత కుటుంబానికి కూడా అందించలేదనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉందనేది తేల్చి అర్హులైన లబ్ధిదారులందరికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడుతున్నామని, అలాగే షాపింగ్ కాంప్లెక్స్‌ల స్థితిగతులను కూడా పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో రిపేర్లు చేపట్టనున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ యువతకు మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్ నిధులను కూడా ఖచ్చితంగా ఆయా సామాజిక వర్గాల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మాల, మాదిగ కార్పొరేషన్ల డైరెక్టర్లు పోతురాజు రవికుమార్, ధరూరు జేమ్స్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె. తులసీదేవి పాల్గొన్నారు.
నిరుపేద దళితులకు
న్యాయం చేసేందుకు చర్యలు
ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్
పెదపూడి విజయకుమార్
Comments
Please login to add a commentAdd a comment