మందుబాబులకు జరిమానా | - | Sakshi
Sakshi News home page

మందుబాబులకు జరిమానా

Published Thu, Feb 20 2025 8:33 AM | Last Updated on Thu, Feb 20 2025 8:33 AM

-

కర్నూలు: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌ తనిఖీలు విస్తృతం చేశారు. ఇందులో భాగంగా మూడవ పట్టణ పోలీసులు 20 మంది మందుబాబులను బుధవారం అరెస్టు చేసి జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరిచారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.3,500, ఓపెన్‌ డ్రింకింగ్‌లో పట్టుబడిన 15 మందికి ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. డ్రంకెన్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌పై జిల్లా వ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతో పాటు వాహనం సీజ్‌ చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.

కేసీ కెనాల్‌లో

యువకుని మృతదేహం

గడివేముల: కరిమద్దెల గ్రామ సమీపంలోని కేసీ కెనాల్‌లో గుర్తుతెలియని యువకుని మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్‌ఐ నాగార్జున రెడ్డి బుధవారం తెలిపారు. యువకుడికి 30 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, బ్రౌన్‌ కలర్‌ టీ షర్టు, బ్లూ కలర్‌ ప్యాంటు ధరించారన్నారు. యువకుని పేరు, వివరాలు వెల్లడి కాలేదని చెప్పారు. వీఆర్‌ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వరకట్న వేధింపుల కేసులో జైలు శిక్ష

కోవెలకుంట్ల: వరకట్న వేధింపుల కేసులో న్యాయస్థానం ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి బుధవారం తెలిపారు. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన షేక్‌ అస్మా కౌసబ్‌ను అదనపుకట్నం కోసం వేధింపులకు గురి చేస్తుండటంతో 2020లో భర్త షేక్‌ జుబేర్‌ అక్రమ్‌, అత్త షేక్‌ ఫర్‌హద్‌ దుల్హాన్‌పై ఫిర్యాదు చేసింది. స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో వరకట్నం కోసమే వేధించినట్లు సాక్ష్యాలు రుజువు కావడంతో న్యాయమూర్తి అబ్దుల్‌ రహిమాన్‌ ఇరువురి నిందితులకు ఏడాది జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 2,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

రైతు దుర్మరణం

వెల్దుర్తి: రోడ్డు ప్రమాదంలో మద్దయ్య(40) అనే రైతు బుధవారం మృతి చెందారు. బోయినపల్లి గ్రామానికి చెందిన ఈయన పొగాకు బేళ్లను అమ్మేందుకు మోటారు సైకిల్‌పై ఓర్వకల్లుకు వెళ్లారు. తిరిగి మోటారు సైకిల్‌పై వస్తుండగా కలుగొట్ల గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మద్దయ్యకు భార్య వెంకటేశ్వరమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు.

వలస కూలీ మృతి

కౌతాళం: జీవనోపాధి కోసం కుటుంబంతో సహా గుంటూరు జిల్లాకు వెళ్లిన వలస కూలి బుధవారం మృతి చెందారు. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కౌతాళం మండలం సుళేకేరి గ్రామానికి చెందిన నగేష్‌(28)కు గ్రామంలో పనులు దొరకలేదు. గత నెలలో కుటుంబంతో సహా గుంటూరు జిల్లాకు వలస వెళ్లాడు. అక్కడ మిర్చి కోత పనులకు వెళుతూ కుటుంబంతో జీవనం కొనసాగించేవాడు. బుధవారం పనులకు ట్రాక్టర్‌లో వెళుతుండగా ప్రమాదవశత్తు ట్రాలీపై నుంచి నగేష్‌ కిందకు పడిపోయాడు. తోటి కూలీలు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఊరుకాని ఊరికి పొట్టకూటి కోసం వలస వస్తే ఇలా జరిగిందని భార్య మహేశ్వరమ్మ రోదిస్తున్న తీరు అందరిని కలిచి వేస్తున్నది. నగేష్‌కు ఒక కుమార్తె ఉన్నారు.

గంజాయి, సారాపై నిఘా

ఆత్మకూరు: శ్రీశైల పరిసరాల్లో గంజాయి, నాటుసారా, లిక్కర్‌ అమ్మకాలపై నిఘా ఉంచామని నంద్యాల అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ రాముడు అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని ఎకై ్సజ్‌ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భక్తులు శ్రీశైలేశుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకోవాలని చెప్పారు. ఎక్కడైనా మద్యం, గంజాయి, నాటుసారా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే తమకు ఎకై ్సజ్‌ కంట్రోల్‌ రూమ్‌ సెల్‌ 93909 43271 కు సమాచారం అందించాలని చెప్పారు. ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఎకై ్సజ్‌ సీఐ కిషోర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement