స్కూటర్ మంజూరైందంటూ మోసం ..!
మద్దికెర: ‘మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ మీకు స్కూటర్ మంజూరు చేసింది. కొంత మొత్తం చెల్లిస్తే మీకు కేటాయిస్తాం’ అంటూ దివ్యాంగులను నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మద్దికెర గ్రామానికి చెందిన దివ్యాంగులు రామకృష్ణ, శ్రీలక్ష్మి, ఆదిలక్ష్మి మరో ఇద్దరికి 9642076467, 6364506562 నంబర్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ‘మీకు ప్రభుత్వం త్రిచక్ర వాహనం మంజూరు చేసింది. కొంత మొత్తం చెల్లిస్తే మీ ఇంటికి స్కూటీ వస్తుంద’ని మూడు రోజుల క్రితం నమ్మించారు. వారి మాటలను నమ్మి ముగ్గురు దివ్యాంగులు మొత్తం రూ. 20 వేలు ఫోన్ పే చేశారు. ఆ తర్వాత రోజు నుంచి ఆ నంబర్లకు ఫోన్ చేసినా ఎటువంటి సమాధానం లేకపోవడంతో మోసపోయామని తెలుసుకుని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దివ్యాంగులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వీరాంజి, అంజనేయులు, మల్లికార్జున కోరారు.
Comments
Please login to add a commentAdd a comment