సకల దేవతలూ.. రారండి!
● శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
● యాగశాలలో ప్రత్యేక పూజలు
● ఘనంగా ధ్వజారోహణ
● నేడు భృంగివాహనసేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలూ.. రారండంటూ దేవస్థాన అధికారులు, ఆలయ అర్చకులు ఆహ్వానం పలికారు. బ్రహ్మోత్సవాలకు సారథ్యం వహించాల్సిందిగా బ్రహ్మ దేవుడిని, స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవంలో కన్యాదానం చేసేందుకు మహావిష్ణువును రావాలని ఆహ్వానించారు. పరమశివుడి వాహనమైన నందిని చిత్రీకరించిన ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. శ్రీశైలంలో మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఆగమశాస్త్రానుసారంగా ఉత్సవ ప్రారంభ పూజలు జరిపారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. వేదపండితులు చతుర్వేదపారాయణలు చేశారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ బ్రహ్మోత్సవ సంకల్పాన్ని అర్చకులు పఠించారు. తరువాత పుణ్యాహవచనం, చండీశ్వరపూజ జరిపించారు. అనంతరం కంకణాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపి కార్యనిర్వహణాధికారి కంకణాన్ని ధరించారు. అనంతరం బ్రహ్మోత్సవ క్రతువులకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. 7గంటలకు ధ్వజారోహణ, భేరిపూజ కార్యక్రమాలు నిర్వహించి సకల దేవతలకు ఆహ్వాన సూచికగా ధ్వజాపటాన్ని ఆవిష్కరించారు.
నేడు భృంగివాహనసేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనసేవలో భక్తులకు దర్శనమిస్తారు. గ్రామోత్సవం నిర్వహిస్తారు.
సకల దేవతలూ.. రారండి!
Comments
Please login to add a commentAdd a comment