నంద్యాల(న్యూటౌన్): మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఇంటర్మీడియెట్, 5వ తరగతి, బ్యాక్‌లాగ్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాల నంద్యాల జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ ఫ్లోరమ్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు దరఖాస్తులను https:// mjpapbcwreis.apcfss.inలో నమోదు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 9866559668, 9440725929 నంబర్లను సంప్రదించాలన్నారు.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
నంద్యాల: ప్యాపిలి మండలం ఏనుగుమర్రి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సాంఘికశాస్త్ర స్కూల్ అసిస్టెంట్ ఎం. బొజ్జన్నను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించడమే కాకుండా విద్యార్థినులపై అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించినట్లు మండల విద్యాశాఖ అధికారి, డిప్యూటీ విద్యాశాఖ అధికారి నివేదిక అందించారన్నారు. విద్యా ర్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేసినట్లు నివేదికలో పొందుపరిచారని పేర్కొన్నారు. ఉపాధ్యాయు ల నీతి, నియమావళి (ఆర్టీఈ ఏసీటీ సెక్షన్–17)ని ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయి నందున ఉపాధ్యాయుడు ఎం.బొజ్జన్నను స స్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఇఫ్తార్ విందులో సామరస్యం
బేతంచెర్ల: హిందువులు, ముస్లింలు కలసి మెలసి ఉంటున్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు హిందువులు ఇఫ్తార్ విందు ఇచ్చారు. బేతంచర్ల పట్టణంలోని షాదీఖానాలో శివ గురుస్వామి బుగ్గన మహేశ్వర్‌రెడ్డి, మాలధారులు సుబ్బారెడ్డి, జయరాముడు, వెంకటేశ్వర్లు గురువారం ముస్లింలకు ఇఫ్తార్ విందును వడ్డించారు. వారిని మతసామరస్య చైతన్య వేదిక అధ్యక్ష, కార్యదర్శులు నూర్ అహ్మద్ , మహమ్మద్ గౌస్, జయంత్ గౌడ్, షాలీబేగ్ అభినందించారు.
ఆసుపత్రిలో చేరిన
గిరిజన బాలుడు
ఆత్మకూరు: మెరుగైన వైద్యం కోసం గిరిజన బాలుడు పులిచెర్ల నాగన్న నంద్యాలలోని జీఎస్‌ఆర్ ఆసుపత్రిలో గురువారం చేశారు. ఆత్మకూరు పట్టణంలోని వెంగళరెడ్డి నగర్ కాలనీకి చెందిన ఈ బాలుడు ఇటీవల మిద్దె నుంచి కింద పడ్డాడు. కాలు విరగడంతో మంచానికే పరిమితం అయ్యారు. ఈ బాలుడి దుస్థితిపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడంతో నంద్యాల జిల్లా కలెక్టర్ స్పందించారు. ఆ బాలుడికి సత్వర వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం బైర్లూటి వైద్యాధికారి పవన్‌కుమార్ సిబ్బందితో బాలుడి ఇంటి వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించి 108 వాహనాన్ని పిలిపించి స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లి వైద్యం అందించారు. అక్కడి నుంచి నంద్యాలలోని జీఎస్‌ఆర్ ఆసుపత్రిలో చేర్పించి తగిన చికిత్సలు అందించారు. ఆరోగ్యశ్రీ కింద బాలుడికి ఆపరేషన్ చేయించడం కోసం అడ్మిట్ చేశామని వారు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం