
వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలి
నంద్యాల(అర్బన్): అనేక లొసుగులతో ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని నంద్యాల ముస్లిం జేఏసీ గౌరవాధ్యక్షుడు మహమ్మద్ అబులైజ్ అన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ అధ్యక్షతన పట్టణంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ముస్లింలకు సీపీఎం, సీపీఐ, ప్రజా, కుల సంఘాలు మద్దతు పలికాయి. పట్టణంలోని గాంఽధీచౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ ప్రియదర్శినికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ గౌరవాధ్యక్షులు మహమ్మద్ అబులైజ్, కన్వీనర్ మౌలానా అబ్దుల్ రషాదీ మాట్లాడుతూ.. వక్ఫ్‌బోర్డు ఆయా ప్రభుత్వాల నియంత్రణలో మంత్రుల నిర్వహణలో ఉన్నది వాస్తమన్నారు. వక్ఫ్ బోర్డు నుంచి ముస్లిం పేదలకు సాయం అందకపోవడానికి ప్రభుత్వాలే కారణమని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చారన్నారు. ముస్లింల పూర్వీకుల ఆస్తులను కాజేసేందుకు తాజాగా కుట్ర చేశారని ఆరోపించారు. రాజ్యాంగ విలువలకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తిలోదకాలు ఇచ్చిందన్నారు. జేపీసీ ఏకపక్షంగా సవరణ బిల్లును పార్లమెంట్ ముందు ఉంచగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తమ ఎంపీల ఓట్లు వేయించడం ఎంత వరకు సమంజసమని ప్రశఇనంచారు. వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకొనే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు.
నంద్యాల నుంచే ‘కూటమి’ ఓటమి
ముస్లిం జేఏసీకో కన్వీనర్ మస్తాన్ ఖాన్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు విరుద్ధంగా ఉన్న వక్ఫ్ సవరణ చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. జేఏసీ నాయకుడు అబ్దుల్‌సమ్మద్ మా ట్లాడుతూ.. రానున్న రోజుల్లో వక్ఫ్ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు ఇస్తారేమోనని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న ‘కూటమి’ ప్రభుత్వం ఓటమి నంద్యాల నుంచే ప్రారంభమవ్వాలని అన్నారు. వచ్చే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నాయకులకు గుణపాఠం చెబుతూ ముస్లింల తడాఖా చూపాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయు డు మాట్లాడుతూ ..లౌకిక వాదంతో ఏర్పాటు అయిన టీడీపీని చంద్రబాబునాయుడు స్వప్రయోజనాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. జేఏసీ ట్రెజరర్ ఆడిటర్ బాషా, సభ్యులు ఎజాజ్ హుసేన్, షమీర్, సీపీఐ నాయకులు బాబాఫకృద్దీన్, సీపీఎం నాయకులు గౌస్, హఫీజ్ వాహిద్ హుసేన్, యూత్ సభ్యులు సయ్యద్ ప్యారే రసూల్, అయూబ్, వశీం, ఇబ్రహీం, సుహేల్, అడ్వకేట్ అసదుల్లా తదితరులు మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకోకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ సభ్యులు మౌలానా ఇద్రూస్, ఐయూ ఎంఎల్ మౌలాలా అబ్దుల్‌సలాం, ఇమామ్‌లు జక్కీవుల్లా, జాకీర్, ఇషాక్, ఎస్‌కే యూనస్, అర్షద్, గులాబ్ ఖాశీం, మునీర్, అమీరుద్దీన్, అబ్దుల్లా షేక్, తదితరులు పాల్గొన్నారు.
నంద్యాలలో ముస్లింల భారీ ర్యాలీ
మద్దతు ఇచ్చిన సీపీఎం, సీపీఐ, ప్రజా,
కుల సంఘాలు

వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలి