ముంచెత్తిన కుందూ
● వాగుల్లో కొనసాగుతున్న ఉధృతి
● పలు దారుల్లో నిలిచిన రాకపోకలు
కోవెలకుంట్ల/ఉయ్యాలవాడ/దొర్నిపాడు: మోంథా తుపాన్ స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్‌లోని ఆయా మండలాలను అతలాకుతలం చేసింది. వల్లంపాడు, కలుగొట్ల, గుళ్లదూర్తి సమీపాల్లో కుందూనది వంతెనపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదనీరు గుళ్లదూర్తి గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీలను చుట్టుముట్టింది. ఆయా కాలనీల్లో పలు ఇళ్లలో వరదనీరు చేరడంతో రెండు రోజుల నుంచి బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.
● నదికి అనుసంధానంగా ఉన్న కప్పలవాగు, కోవెలకుంట్ల– లింగాల ఆర్‌అండ్‌బీ రహదారిలోని నల్లవాగు, చిన్నవంచె, పాలేరు వాగుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఈ రహదారిలో మూడు రోజుల నుంచి రాకపోకలు స్తంభించి పోయాయి.
● దొర్నిపాడు గ్రామంలోని గాడిదొంకకు వరద నీరు చేయడంతో రాకపోకలు స్తంభించి పోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
● కుందూనది నది ఉగ్రరూపానికి ఉయ్యాలవాడ మండలంలోని రూపనగుడి, ఉయ్యాలవాడ, ఇంజేడు, పెద్దయమ్మనూరు, బోడెమ్మనూరు, కాకరవాడ, ఒంటెద్దుపల్లె, హరివరం, నర్సిపల్లె, సుద్దమల్ల, పడిగెపాడు, మాయలూరు, అల్లూరు, ఎస్.కొత్తపల్లె గ్రామాల చుట్టూ వరద నీరు చుట్టు ముట్టింది. దీంతో ఈ గ్రామాల ప్రజలు జల దిగ్బందంలో వుండిపోయారు. రాకపోకలు స్తంభించిపోవడంతో అవస్థలు పడుతున్నారు.
ముంచెత్తిన కుందూ


