ఎకో టూరిజం పార్కు మరింత అభివృద్ధి
కొల్లాపూర్ రూరల్/పెద్దకొత్తపల్లి: కొల్లాపూర్ మండలం సోమశిల సమీపంలోని అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న ఎకో టూరిజం పార్కును మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సువర్ణ అన్నారు. బుధవారం అటవీశాఖ అధికారులతో కలిసి ఎకో టూరిజం పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులో చేపట్టిన పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సోమశిల కృష్ణానది తీరంలో ఎకో టూరిజం కింద అనేక అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అదే విధంగా నేషనల్ హైవే ప్రాజెక్టుతో పాటు సోమశిల – సిద్దేశ్వరం మధ్య కృష్ణానదిపై కేబుల్ బ్రిడ్జి ప్రతిపాదనలు అటవీశాఖకు అందినట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుసంధానంగా అటవీ ప్రాంతం పరిధి ఉందని.. ఆయా ప్రతిపాదనలపై అవసరమైన చర్యలు చేపడతామన్నారు. సోమశిలలో ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా సఫారి రివర్ బోటు ఏర్పాటు చేశామన్నారు. నల్లమలలో పర్యాటకులు చూడాల్సిన ప్రాంతాలు అనేకం ఉన్నాయని.. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అనంతరం ఎకో పార్కులో కల్పించాల్సిన వసతులపై ఆరా తీశారు. ప్రధాన రహదారి నుంచి పార్కు పైభాగం వరకు సీసీరోడ్డు నిర్మిస్తామని తెలిపారు. త్వరలోనే పర్యాటకులకు పార్కును అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం సోమశిలలో అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బాచారం అటవీ భూముల పరిశీలన..
పెద్దకొత్తపల్లి మండలం బాచారం సమీపంలోని అటవీ భూములను అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సువర్ణ పరిశీలించారు. అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని కొల్లంపెంట, తార్లపల్లి, కుండిచింతల, బైలుతాటి గుండాలపెంట, వటువర్లపల్లి గ్రామాల ప్రజలను బాచారం సమీపంలోని నేషనల్ హైవే–167 పక్కన ఉన్న 6వేల ఎకరాల మైదాన ప్రాంతానికి (అటవీ భూమి) తరలింపునకు సంబంధిత అధికారులు చేపట్టారు. ఆయా గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించే ప్రాంతాన్ని ఆమె పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. నల్లమల అభయారణ్యంలోని చెంచులు మైదాన ప్రాంతానికి తరలిరావడానికి సుముఖంగా ఉన్నారని తెలిపారు. ఇక్కడికి వచ్చే ఆయా గ్రామాల ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలోఎఫ్‌డీపీటీ రాంబాబు, డీఎఫ్‌ఓ రోహిత్, ఎఫ్‌డీఓలు తిరుమల్‌రావు, రామ్మోహన్, ఫారెస్టు రేంజర్‌లు చంద్రశేఖర్, ఈశ్వర్, సాతాపూర్ సెక్షన్ ఆఫీసర్ వెంకటేష్, ముజీబ్, జయదేవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment