మౌంటెన్ సైక్లింగ్‌లో విద్యార్థుల ప్రతిభ
మక్తల్: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 9 వరకు రంగారెడ్డి జిల్లా కోహెడ అడవుల్లో జరిగిన 9వ రాష్ట్ర స్థాయి మౌంటెన్ సైక్లింగ్ పోటీలలో నారాయణపేట జిల్లా విద్యార్థులు జిల్లా ప్రధాన కార్యదర్శి బి. గోపాలం ఆధ్వర్యంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. మొత్తం 242 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా, జిల్లా నుంచి అత్యధికంగా 37 మంది బాలబాలికలు 10 కి.మీ. మౌంటెన్ సైక్లింగ్ పోటీలో అసమాన ప్రతిభ కనబర్చారు. నర్వ మండలం రాయికోడ్ గ్రామానికి చెందిన కూలీ పని చేసే వెంకటయ్య, అంజమ్మల పెద్ద కూతురు టి.అనూష గోల్డ్ మెడల్ సాధించింది. అనూష ఈ నెల 28 నుంచి 31 వరకు హర్యానా రాష్ట్రం పంచకుల అడవులలో జరుగే మౌంటెన్ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటుందని గోపాలం తెలిపారు. 16 ఏళ్లలోపు సైక్లింగ్ పోటీలలో త్రివేణి 4వ స్థానం, పల్లవి ఏడో స్థానం, రాఘవేందర్ 10వ స్థానం సాధించారు. వారితో పాటు 14 సంవత్సరాలలోపు సైక్లింగ్ పోటీలలో పలువురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు మల్లారెడ్డి, విజయ్‌కాంతారావు, మ్యాక్సీన్‌వెల్, వెంకటనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment