
పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
నారాయణపేట: ప్రభుత్వ పాఠశాలలకు విడుదలైన పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పీఎంశ్రీ కార్యక్రమం అమలుపై మంగళవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పీఎంశ్రీ పథకానికి మొదటి విడతగా 12 పాఠశాలలు, రెండో విడతగా ఏడు పాఠశాలలు ఎంపికయ్యాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సకాలంలో ఖర్చు చేయాలని డీఈఓ గోవిందరాజులుకు సూచించారు. సంబంధిత పాఠశాలల్లో చేపట్టిన పనుల పూర్తి వివరాలతో డాక్యుమెంట్ తయారుచేసి ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. అనంతరం పదో తరగతి వార్షిక పరీక్షలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు జరగబోతున్నాయని.. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో గణిత, భౌతిక శాస్త్రంలో విద్యార్థులు వెనకబడి ఉన్నారని.. వారికి పాఠ్యాంశాలు అర్థమయ్యే విధంగా చూడాలన్నారు. ఈ విషయంపై సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించాలని డీఈఓకు సూచించారు. జిల్లాలోని సబ్జెక్టు ఫోరమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు తగు సూచనలు ఇవ్వాలని, సబ్జెక్టుల వారీగా అవగాహన కల్పించాలని అన్నారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారంలో నాణ్యత పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు మూడవ స్లిప్ టెస్ట్ పూర్తయిన తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని.. జిల్లాలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎఫ్‌ఏఓ చారి, సెక్టోరియల్ అధికారులు విద్యాసాగర్, శ్రీనివాస్, రాజేంద్రకుమార్, నాగార్జునరెడ్డి తదితరులు ఉన్నారు.
మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ.. ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. మండలాల వారీగా సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. మాస్టర్ ట్రైనర్స్‌చే వీరికి శిక్షణ తరగతులు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి, డీపీఓ కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment