
ఎన్నికలకు సన్నద్ధం కావాలి
నారాయణపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రిటర్నింగ్ అధికారులు, స్టేజ్ వన్, టూ సహాయ రిటర్నింగ్ అధికారులకు జిల్లా కేంద్రంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ సింగారంలో బుధవారం మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ఆర్‌ఓలు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ రోజు నుండే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకుని, నోటిఫికేషన్ లో స్పష్టంగా వివరాలను పొందుపర్చాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. సమయపాలనను పక్కాగా పాటిస్తూ, నామినేషన్ల స్వీకరణ కేంద్రం గదిలో తప్పనిసరిగా గోడ గడియారం అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనా అన్నది ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలన్నారు.
నిబంధనలు తప్పనిసరి
అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామినేషన్ల దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటీ అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి ప్రతి రోజు త్వరితగతిన డైలీ రిపోర్టును పంపించాలని, సంబంధిత వెబ్ సైట్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ చివరి సమయంలో, విత్ డ్రా సమయాల్లో వీడియో చిత్రీకరణ చేయిస్తే, తగిన ఆధారాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పక్కాగా జరిగితే, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆర్‌ఓలు, సహాయ ఆర్‌ఓలకు కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. శిక్షణ తరగతుల్లో ట్రైనీ కలెక్టర్ గరిమనరుల, అదనపు కలెక్టర్ బెన్ షాలం, డీపీఓ కృష్ణ, డీఈఓ గోవిందరాజు, ఆర్.ఓలు, సహాయ ఆర్.ఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment